కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించిన ఏపీ
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖలోని వివిధ పథకాలకు పలువురు వైతాళికుల పేర్లు పెట్టినట్టు ప్రకటించిన నాటి నుంచి దీనిపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక రాష్ట్రాల్లో పథకాలకు పాల కుల పేర్లు పెట్టుకొని ప్రచారం చేసుకోవటం పరిపాటిగా మారింది.
ఒకవేళ ప్రభు త్వం మారితే ఆ వెం టనే పాత పాలకుల పేర్లు తొలగించి కొత్త పాలకుల పేర్లు పెట్టుకోవటం సర్వ సాధారణమైంది. ఏపీలో వైసీపీ ప్రభు త్వం అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ ప్రభుత్వ పథకానికి నాటి సీఎం వైఎస్ జగన్ పేరే ఉండేది. ‘జగనన్న’ అనే పదం లేకుండా పథకాలే ఉండేవి కావంటే ఆశ్చర్యం లేదు. తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే ఉండేది. బీఆర్‌ఎస్ హయాంలో నాటి సీఎం కేసీఆర్ పేరుతో అనేక పథకాలు నడిచాయి. బీఆర్ ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటి లో చాలా పథకాలను మొత్తమే రద్దు చేశారు.
చరిత్రలో చిరస్థాయి
ఏపీలోని విద్యాశాఖ అమలు చేస్తున్న ఆరు పథకాలకు ప్రభుత్వం పేర్లు మార్చింది. అందులో ప్రధానమైనది మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. ఇప్పటి తరానికి ఆమె ఎవరో తెలియకపోవచ్చు కానీ, 1900 ప్రాంతంలో కోస్తాంధ్ర లో ఆమె పేరు తెలియని వారు ఉండేవారు కాదు. అలా అని ఆమె ఏ రాజకీయ నాయకురాలో, జమీందారో కాదు. ఒక సాదాసీదా గృహిణి. పక్కా ఇల్లు కూడా లేని మహిళ.
అయితేనేం ఆమె తుది శ్వాస విడిచేవరకు తన ఇంటికి వచ్చి ఆకలి అన్న ప్రతి ఒక్కరికి లేదనకుండా ఆకలి తీర్చేవారు. దాదాపు 40 ఏండ్లపాటు వేలమంది పేదలు, బాటసారులకు పైసా ఆశించకుండా ఆకలి తీర్చారు. అలా ఆమె ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. విద్యాశాఖలోని మరికొన్ని పథకాలకు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం పేర్లు పెట్టారు. ఈ వరుసలో మరో ముఖ్యమైన పేరు ఎల్లాప్రగడ సుబ్బారావు.
ప్రపంచం ప్రాణాలు కాపాడుతున్న ఎల్లాప్రగడ
వైరల్ జ్వరం వస్తే ఆంటీ బయాటిక్, జలువు చేస్తే యాంటీ బయాటిక్, పెద్ద రోగమొచ్చినా యాంటీ బయాటిక్.. ఇప్పుడు మనం చూస్తున్న మందుల్లో ఇదే ముఖ్యమైనది. దీనిని కనిపెట్టింది ఏ తెల్లవాడో అను కొంటాం. మనకు పెన్సిలిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త గురించి తెలుసు కానీ.. క్యాన్సర్ నుంచి కరోనా వరకు, జలుబు జ్వరం వరకు ఏ రోగం వచ్చినా వేసుకొనే మందు లు సృష్టించిన మన తెలుగు శాస్త్రవేత్త గురించి మాత్రం చాలామందికి తెలియదు. ఇప్పుడు శాస్త్ర పరిశోధనల్లో అత్యున్నతమైనది నోబెల్ బహుమతి. ఎంతో గొప్పగొప్ప శాస్త్రవేత్తలకే అది లభిస్తుంది.
కానీ, మన తెలుగు శాస్త్రవేత ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలే చెప్పిన మాట ఏమిటంటే.. ఎల్లాప్రగడకు నోబెల్ ఇవ్వాల్సి వస్తే ఒక్కటి సరిపోదు వంద ఇవ్వాలని.. దీనిని బట్టే ఆయన ప్రపంచానికి అందించిన సేవలు ఎలాంటివో అర్థం చేసుకో వచ్చు. ఆయన సేవలకు గుర్తుగా ఓ ఫంగస్‌కు సుబ్బారోమైసిస్ అని పేరు పెట్టారు.
జంపింగ్ స్పైడర్లలోని ఓ జాతికి టాంజానై ఎల్లాప్రగడై అని నామకరణం చేశారు. అనేక వ్యాధుల నుంచి ప్రపంచ మానవాళిని కాపాడిన, కాపాడుతున్న సుబ్బా రావుకు రావాల్సినంత ప్రచారం, గుర్తింపు రాలేదు. ఇకమీదటైనా ఆయనకు తెలుగు రాష్ట్రాలతోపాటు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇస్తుందని ఆశిద్దాం.