26-02-2025 06:35:07 PM
భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు..
వైభవంగా శివపార్వతుల కళ్యాణం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివాలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. పలుచోట్ల శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా చేపట్టారు. వాంకిడి మండల కేంద్రంలోని శివకేశవ ఆలయంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ నాయక్, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్ శివాలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో పనులు పంపిణీ చేశారు. శ్రీ బాలేశ్వర ఆలయంలో టెలి సిని దర్శకనిర్మాత నాగ బాల సురేష్, జిల్లా రవాణా శాఖ అధికారి రామచంద్రనాయక్ ప్రత్యేక పూజలు చేశారు.
ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట శివాలయంలో బిజెపి నేత అరిగెల నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ ప్రత్యేక పూజలు చేపట్టారు. బూరుగుడా గ్రామంలోని శివపంచాయతన ఆలయంలో పేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం చేపట్టారు. రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని శివాలయం వద్ద అత్యంత వైభవంగా రథోత్సవాన్ని చేపట్టారు. కాగజ్ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న ఆలయంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రవి శ్రీనివాస్, జెడ్పి మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేపట్టారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు, మజ్జిగను పంపిణీ చేశారు.జిల్లా వ్యాప్తంగా నెలకొన్న శివ క్షేత్రాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.