బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్
మంచిర్యాల, నవంబర్ 17 (విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారే తప్ప ఇప్పటి వరకు ఒక్క గింజను కూడా కొనలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి దుయ్యబట్టారు. ఆదివారం హాజీపూర్ మండలం పడ్తనపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి రెండు వారాలవుతున్నా కొనుగోలు చేయడం లేదని, తాలు ఉందని తిరిగి తూర్పారబట్టాలని కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తూకం ఎక్కువ పెడితే కాంటా చేస్తామంటూ రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు రూ. 2 లక్షల రుణమాఫీ అటే పోయిందని, పెట్టుబడి సాయం మాయమైందని, రూ.500 బోనస్ అమలు కాలేదన్నారు. రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుందని దుయ్యబట్టారు. ఆయనవెంట జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కిషన్, మాధవరపు వెంకట రమణరావు, బొలిశెట్టి అశ్విన్‌రెడ్డి, గడ్డం స్వామి, సత్యనారాయణ, ప్రశాంత్, అంకం శ్రీనివాస్, హనుమాన్, బొడ్డు తిరుపతి, తిరుపతి, సురేష్ ఉన్నారు.