* ఢిల్లీలో సావర్కర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న కళాశాలకు ప్రధాని శంకుస్థాపన
* మన్మోహన్ పేరు పెట్టాల్సిందేనన్న కాంగ్రెస్
* కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
న్యూఢిల్లీ, జనవరి 03: ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో హిందూత్వ ప్రతీక వీర్ సావర్కర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న కళాశాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో కళాశాలకు సావర్కర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ మండిపడింది.
కాంగ్రెస్ విమర్శలకు దీటుగా బీజేపీ ఎదురుదాడి చేసింది. ఇటీవలే చనిపోయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలంటూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ డిమాండ్ చేయగా, జాతీయ వారసత్వ నాయకులను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని బీజేపీ విమర్శించింది.
ఢిల్లీలోని నజాఫ్‌గడ్‌లో రూ.140 కోట్లతో వీర్ సావర్కర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. 2021లో ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జిక్యూ టివ్ కౌన్సిల్ కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అయితే కళాశాలకు సావర్కర్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ప్రధాని మోదీకి లేఖ రాసింది.
దేశంలో విద్యారంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివని, దేశంలో ఐఐటీలు, ఐఐఎం లు, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలను ఏర్పాటు చేశారని గుర్తుచేసింది.
కేంద్రీయ విశ్వవిద్యాల యాల చట్టాన్ని తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్నారని తెలిపింది. అంతటి గొప్ప వ్యక్తి పేరు విద్యాలయాలకు పెడితే రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కొనియాడింది.
అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రమోద్ తివారి మీడియాతో మాట్లాడుతూ..కళాశాలకు వీర్ సావర్కర్ పేరు పెడుతున్నారంటే సమాజ వర్గీకరణకు ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. వీర్ సావర్కర్ కు ఢిల్లీకి ఎలాంటి సంబంధం లేదని, ఢిల్లీ లేదా పరిసర ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల పేరు పెడితే ఈ వివాదం తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు.
“సావర్కర్ పింఛన్ కోసం బ్రిటీష్ వారికి క్షమాపణలు కోరుతూ లేఖలు రాశారని, అలాంటి వ్యక్తి పేరును కళాశాలకు ఎలా పెడ్తారో ప్రధాని మోదీ పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ నాసిర్ హుస్సేన్, సుఖ్వీందర్ రంద్వా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించలేదన్నారు. అందుకే సావర్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తోందన్నారు.
ఢిల్లీ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సావర్కర్‌ను ఇందిరా గాంధీ, ఉద్దవ్ థాక్రే వంటి వారు పొగిడారని, అంటే వారు తప్పు చేసినట్టా అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.
మన్మోహన్ సంతాప సభలో కాంగ్రెస్ అగ్రనేతలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపసభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఢిల్లీలోని గురు ద్వారాలో శుక్రవారం మన్మోహన్ కు టుంబ సభ్యులు ఈ సంతాపసభను నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.
మన్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. సిక్కు మతానికి చెందిన పలువురు పెద్దలు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.