25-03-2025 12:18:48 AM
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
ముషీరాబాద్, మార్చి 24: (విజయక్రాంతి): ప్యారా నగర్, నల్లపల్లి ప్రజలకు, పర్యావరణానికి హాని కలిగించే డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ లో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్ల పల్లి కామా పేరానగర్ డంపింగ్ యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి, ప్యారానగర్ డంపింగ్ యార్డును వెంటనే రద్దుచేసి ఆ ప్రాంత రైతులను, ప్రజలను ఆదుకోవాలని అన్నారు. గుమ్మడిదల మం డలం నల్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్యారా నగర్ శివారులో 152 ఎకరాల భూ మిని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్‌ఎంసి డంపింగ్ యార్డ్ (ఎంఎస్ డబ్ల్యూ) కు కేటాయించిందన్నారు.
జిహెచ్‌ఎంసి రాంకీ సంస్థకు డంపిం గ్ యార్డ్ నిర్మాణ పనులను అప్పగించిందన్నారు. డంపింగ్ యార్డ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. జనావాసాలకు దూరంగా, పర్యావరణంకి నష్టం లేకుండా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మండలం జేఏసీ చైర్మన్ జైపాల్ రెడ్డి, ప్రజాసంఘాల పోరాట వేదిక కన్వీనర్ కే. రాజయ్య, పటాన్ చెరు సిఐటియు ఏరియా ఇన్చార్జి బి. నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు జేఏసీ నాయకులు రామకృష్ణ, శేఖర్, మల్లే శం గౌడ్, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.