calender_icon.png 24 October, 2024 | 11:47 AM

పరుష పదజాలం వాడితేనే స్పందిస్తారా..!?

02-09-2024 11:23:18 AM

విద్యుత్ శాఖ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం. 

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: పరుష పదజాలంతో దూషిస్తేనే అధికారులు స్పందిస్తారా అంటూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులపై మండిపడ్డారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి నేలమట్టమైన విద్యుత్తు స్తంభాలు, మట్టి మిద్దెలు, ధ్వంసం అవుతున్న చెరువులు, కుంటలు, కాల్వలను పరిశీలించారు. సోమవారం తిమ్మాజిపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రజలు ఫోన్ చేసినా విద్యుత్ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని తన దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ అధికారుల వద్ద ఫోన్లో మాట్లాడారు. ప్రజల పన్నులతో జీతం పొందుతున్న అధికారులు ప్రజల కోసం పనిచేయాలి. కానీ సమస్యలు ఉన్నాయని ఫోన్లు చేసినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గత ప్రజా ప్రతినిధి లాగా పరుష పదజాలంతో దూషిస్తేనే స్పందిస్తారా అంటూ మండిపడ్డారు. ఉన్నతాధికారులకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారు. కూలిన మట్టిమిద్దే స్థానంలో వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఆదుకుంటామని భరోసా కల్పించారు. మరికొన్ని మట్టి మిద్దెలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని వాటిని గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరారు.