calender_icon.png 27 October, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండుకుండలా నాగార్జున సాగర్

05-08-2024 02:17:37 AM

  1. నేడు ఉదయం 8 గంటలకు క్రస్టుగేట్లు ఎత్తివేత 
  2. ఆదేశాలు జారీ చేసిన చీఫ్ ఇంజినీర్ 
  3. పులిచింతలకు చేరనున్న 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం 

హైదరాబాద్/నల్లగొండ/నాగర్‌కర్నూల్/గద్వాల(వనపర్తి), ఆగస్టు 4 (విజయక్రాంతి): నాగార్జున సాగర్‌లో క్రస్టుగేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు 6 నుంచి 8 రేడియల్ క్రస్టుగేట్లను ఎత్తి స్పిల్ వే నుంచి రెండు లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు నీటి పారుదల నల్లగొండ చీఫ్ ఇంజినీర్ పీవీఎస్ నాగేశ్వర్‌రావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.

ఎగువ శ్రీశైలం నుంచి భారీగా వర ద వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు నిండకుండను తలపిస్తోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థా యి నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 576 అడుగులు (271.90 టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో భారీగా వస్తుండటంతో కొన్నిగంటల్లోనే రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరే అవకాశం ఉన్నందున క్రస్టుగేట్లు ఎత్తాలని నిర్ణయించారు.

గేట్లు తెరుస్తున్నందున నది దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని నల్లగొండ, సూర్యాపేట, గుంటూరు, నరసరావుపేట (పల్నాడు), విజయవాడ, కృష్ణా  జిల్లా కలెక్టర్లతోపాటు ఎస్పీలను సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆదేశించారు. నదిలో జాలర్లు వేట కు వెళ్లవద్దని సూచించారు. క్రస్టుగేట్లు ఎత్తే సమయంలో మొరాయించకుండా సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలోనే రబ్బరింగ్, గ్రీసింగ్, గేర్ ఆయిల్ మార్పిడి పనులు పూర్తి చేశారు. 

వారం రోజుల్లోనే సాగర్‌కు జలకళ

నాగార్జున సాగర్ జలాశయం గత నెల 25 వరకు డెడ్ స్టోరేజీలో ఉంది. కృష్ణా బేసిన్‌లో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టులన్నీ నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేశారు. ఈ నెల 28న శ్రీశైలం 3 క్రస్టు గేట్లు ఎత్తి 1.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నాగార్జునసాగర్‌కు చేరింది. ఆ తరువాత నిత్యం 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టు నిండు కుండలా మారింది.

పదిరోజుల క్రితం తాగునీటికి కష్టమైన పరిస్థితులు ఉండగా ఇప్పు డు ఏకంగా ప్రాజెక్టు నిండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగ ర్, ఎడమ, కుడి కాల్వకు సాగునీటి అవసరా ల దృష్ట్యా 10 వేల క్యూసెక్కులకుపైగా  విడుదల చేశారు. ఎస్సెల్బీసీ, లోలెవల్ కాల్వలకు 1500 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్ కేం ద్రంలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ మరో 26 వేల క్యూసెక్కులు దిగువ పులిచింతలకు వదులుతున్నారు.  

కొనసాగుతున్న జూరాల వరద 

ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకు వరద జోరు కొనసాగుతున్నది. ఆదివారం 2 లక్షల 60వేలు క్యూసెక్యులు వరద నీరు జూరాలకు రాగా 34 గేట్ల నుంచి 2,28,830 క్యూసెక్యులు నీరు బయటకు వదిలారు. జూరాల నుంచి 2,42,628 క్యూసెక్యులు, సుంకేసుల నుంచి 1,37,039 క్యూసెక్యులు, ఇతర ప్రాంతం నుంచి 20వేల క్యూసెక్యులు.. మొత్తంగా 4లక్షల 491 క్యూసెక్యుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. ప్రస్తుతం 203 టీఎంసీలతో 882 అడుగుల వద్ద నీటి నిల్వ స్థిరంగా కొనసాగుతోంది.