జడ్పీ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం
రెండు ఫీట్ల మేర కిందికే జెండా ఎగురవేత
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రస్తుత జడ్పీ కార్యాలయం ముందు చేపట్టిన జెండా కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. జెండా ఎగరేసేందుకు సాయంగా నూతన తాడు కొనుగోలు చేయాల్సి ఉండగా కక్కుర్తి పడి పాత తాడునే జాయింట్ చేసి ఉంచడంతో జెండా పూర్తిగా పైవరకు వెళ్లకుండా మోరాయించింది. దీంతో జడ్పీసీఈఓ దేవా సహాయం జెండాకు రెండు ఫీట్లు కిందే ఎగరవేసి కార్యక్రమాన్ని ముగించారు. తర్వాత తేరుకుని మళ్లీ జెండాను కిందికి దించి సరి చేశారు. దీనిపై జడ్పి సీఈఓను వివరణ కోరగా పిన్నిస్ ఊడిపోయిందంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.