న్యూఢిల్లీ: భారత ఏస్ షట్లర్ సుమిత్ నాగల్ పురుషుల సింగిల్స్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్ లో సుమిత్ నాగల్ 77వ స్థానంలో నిలిచాడు. తద్వారా ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. జర్మనీ వేదికగా జరిగిన హెయిల్‌బ్రోన్ నెకార్‌కప్ చాలెంజర్ ట్రోఫీలో సుమిత్ నాగల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ల్లో నాగల్ 6-1, 6-7 (5/7), 6-3తో రిట్‌స్కార్డ్ (స్విట్జర్లాండ్)ను ఓడించి టైటిల్ అందుకు న్నాడు.
తాజా విజయంతో 713 పాయింట్లతో 18 స్థానాలు ఎగబాకిన సుమిత్ కెరీర్ బెస్ట్ సాధించాడు. ఇక పారిస్ ఒలింపిక్స్‌కు పురుషుల, మహిళల సింగిల్స్ విభాగం మెయిన్ డ్రాకు టాప్ 56 మంది ప్లేయర్లు నేరుగా అర్హత సాధించనున్నారు. ఒలింపిక్స్ ప్రమాణాల ప్రకారం సింగిల్స్ విభాగంలో ఒక దేశం నుంచి నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో నిబంధనల ప్రకారం తక్కువ ర్యాంక్ కలిగిన ఆటగాడికి ఒలింపిక్స్ ఆడే అవకాశం లభిస్తుంది. ఈ లెక్కన 77వ ర్యాంక్‌లో ఉన్న సుమిత్ నాగల్ భారత్ తరపున విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత టెన్నిస్ ప్లేయర్ సోమదేవ్ వర్మన్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా 2012 లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే.