బస్తాద్ (స్వీడన్): ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. బస్తాద్ వేదికగా జరుగుతున్న స్వీడీష్ ఓపెన్‌లో నాదల్ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం పురుషుల సింగిల్స్‌లో నాదల్ 4-6 6-3 6-4 డుకోవిక్ (క్రొయేషియా)ను చిత్తు చేశాడు. రెండు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన నాదల్ రెండో సెట్ నుంచి ఫుంజుకొని పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మ్యాచ్‌లో 21 విన్నర్లు కొట్టిన నాదల్ ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. 5 డబుల్ ఫాల్ట్స్, 19 అనవసర తప్పిదాలతో డుకోవిక్ మూల్యం చెల్లించుకున్నాడు. 2022 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత నాదల్ మళ్లీ ఒక టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. గత రెండేళ్లుగా గాయాలతో ఇబ్బంది పడుతూ వస్తోన్న నాదల్ తాజా ప్రదర్శనతో ఒలింపిక్స్‌కు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. పారిస్ క్రీడల్లో సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగనున్న నాదల్ సహచరుడు అల్కరాజ్‌తో జత కట్టనున్నాడు.