29-03-2025 09:57:39 PM
వేలాదిగా తరలివచ్చిన భక్తులతో వెల్లువిరిసిన ఆధ్యాత్మికత
గజ్వేల్: ప్రసిద్ధ నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్ర నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి విమాన రథోత్సవం అత్యంత వైభవంగా, నయనానందకరంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి విశ్వనాథ శర్మ నేతృత్వంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక వేద పండితుల మంత్రోశ్చరణలు, భక్తజనుల జయ జయ ద్వానాల మధ్య రధప్రతిష్ట నిర్వహించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విమాన రథంపై సతీసమేతులైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని అధిష్టింపజేశారు. శనివారం తెల్లవారుజాము వరకు భక్తులు శ్రీ స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకోవడంతోపాటు హరిద్రానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు.
అనంతరం అశేష భక్త జనసందోహం మధ్య స్వామి వారి విమాన రథాన్ని నాచగిరి పురవీదుల్లో ఊరేగించగా, విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గుప్త, నాచగిరి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మి నర్సింలు గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సందీప్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గౌరారం ఎస్సై కర్ణాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.