calender_icon.png 29 March, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన రైతులకు నాబార్డ్ అండ

25-03-2025 12:53:37 AM

  • దేవరకొండలోని పైలెట్ గ్రామాల్లో పంట భూముల అభివృద్ధి 

రైతులకు స్ప్రింక్లర్లు, పైపులు, డ్రిప్పులు  అందజేత 

వాటర్ షెడ్ కమిటీలతో మరింత ఆసరా 

దేవరకొండ, మార్చి 24: నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) గిరిజన రైతులకు అండగా నిలుస్తున్నది. నాబార్డ్ నిధులతో జలసంరక్షణ పనులతో పాటు వివిధ పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు.

దేవర కొండ మండలం గొల్లపల్లి, వెంకట్తండా,  ధర్మతండా, సపావట్ తండా ను నాబార్డ్ ఐదేండ్ల క్రితం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. డబ్ల్యూడీఎఫ్ (వాటర్ షెడ్ డెవలప్మ్మెంట్ ఫండ్) నిధులతో ఆయా గ్రామాల్లో భూముల అభివృద్ధి చేపట్టింది. ఇక్కడ ఏర్పాటైన వాటర్ షెడ్ కమిటీలు వివిధ పనుల కోసం రైతులకు సబ్సిడీలు మంజూరు చేస్తూనే తండాల వాసులకు ఉపాధికి మార్గాలను అన్వేషిస్తున్నాయి. 

ఆ గ్రామాల్లో చేపట్టిన పనులివే...

నాబార్డ్ ఎంపిక చేసిన గ్రామాలైన గొల్లపల్లి, వెంకట్తండా,  ధర్మతండా, సపావట్ తండాలో  రైతుల పొలాల్లో నీరు వృథాగా పోకుండా రాతి కట్టడం, పాంపాండ్స్, సంకెన్ పిట్స్, వరద కట్టల నిర్మాణం చేపట్టారు. నీటి నిల్వలు తగ్గకుండా చూడడం, బోరుబావులు రీచార్జ్ చేయడం లాంటి జలసంరక్షణ పనులు చేశారు.

అర్హులైన రైతులను ఎంపిక చేసి 1,100 హెక్టార్లలో నాబార్డు సహకారంతో యాక్షన్ ఫర్ రూబెల్ డెవలప్మెంట్ సొసైటీ (ఏఆర్‌ఎస్) ఆధ్వర్యం రైతులకు స్ప్రింక్లర్లు, పైపులు, డ్రిప్లు అందించారు.  దొండ సాగుకు పందిళ్ల ఏర్పాటు, రైతుల పొలాలకు పైపులైన్ పనులు పూర్తి చేసి చేయూతనిచ్చారు.

ఇందుకు మొత్తం ఖర్చులో రైతులు 30శాతం చెల్లించగా నాబార్డు 70 శాతం సబ్సిడీ మంజూరు చేసింది. ఈ ఐదేండ్లలో గిరిజన రైతుల పొలాల అభివృద్దికి రూ.80లక్షలు మంజూరు చేసింది. దీంతో గిరిజనులు వివిధ పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.