calender_icon.png 27 December, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను బతిమాలినా.. అధికారం కోసం పార్టీ మారారు

01-08-2024 12:59:24 AM

సబితమ్మను ఉద్దేశించి భట్టి  

సబితా ఇంద్రారెడ్డి పార్టీ మార్పు పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో స్పందించారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇంకా ఆవేదన చెందుతున్నాం, బాధపడుతున్నాం అంటే ఎట్లా అని సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏ మొహం పెట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సబితాఇంద్రారెడ్డిని 2004 ముందు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రాగానే ఆమెకు మంత్రి పదవిని ఇచ్చారని చెప్పారు. 2009లో మళ్లీ టికెట్ ఇచ్చి మంచి పోర్ట్ పోలియోతో మంత్రిగా గౌరవించినట్టు తెలిపారు. కాంగ్రెస్ పెద్ద హృదయంతో తనను ప్రతిపక్ష నేతగా ప్రకటించిందని, ఒక దళితుడిని ప్రతిపక్ష నేతగా ఈ రాష్ర్ట చరిత్రలో ఏ పార్టీ చేయలేదని భట్టి అన్నారు.

దశాబ్ద కాలం మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి తన వెనుక ఉండి.. ఎల్వోపీగా నిలబెట్టాల్సింది పోయి, అధికారం కోసం పార్టీ మారినట్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పుడు తాము ఆమెను బతిమిలాడినట్టు గుర్తుచేశారు. ‘మీరు పోతే ఎల్వోపీ హోదా పోతుంది. కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది. కాంగ్రెస్‌లో అన్ని పదవులు అనుభవించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ మీకు ఏం తక్కువ చేసింది కావాలంటే భవిష్యత్తులో ఇంకా చేస్తుంది’ అని బతిమిలాడితే ఒక్కసారి అయినా ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. అధికారం కోసం, స్వార్థం కోసం తనకు ఎల్వోపీ లేకుండా చేయడం కోసం బీఆర్‌ఎస్‌లో చేరారని ఆరోపించారు. ఈ రోజు ఆందోళన చెందాల్సింది మీరు కాదని, తానని అన్నారు. ఆ తర్వాత సభ అదుపు తప్పడంతో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.