- ఆరేళ్లుగా ఆందోళనలు.. పట్టించుకోని అధికారులు
- పోలీసు పహారా మధ్యే తవ్వకాలు?
- ప్రశార్థకంగా ఉమా మహేశ్వర లిఫ్టు ప్రాజెక్టు
నాగర్‌కర్నూల్, నవంబర్ 9 (విజయక్రాంతి): నల్లమల్ల అటవీ ప్రాంతంలోని రిజ ర్వు ఫారెస్ట్‌కు అత్యంత దగ్గరగా ఉన్న నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలోని గుట్టపై మైనింగ్ మాఫియా అక్రమంగా తవ్వకాలు జరుపుతోంది. దీనిపై గ్రామస్థులు ఆరేళ్లుగా ఉద్యమిస్తూనే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
మైలారం గుట్టకు ఆనుకుని ఉన్న చెరువుపై ఆధారపడి మూడు గ్రామాల రైతులు వ్యవసాయం చేస్తున్నారు. నల్లమల్ల అటవీ ప్రాం తంలోని టైగర్ రిజర్వ్ ప్రాంతానికి అతంత్య సమీపంగా ఉండటంతో ఈ ప్రాంతంలో చెట్లు, మొక్కలను తొలగించాలన్నా, తవ్వకాలు జరపాలన్నా అటవీ శాఖ అనుమ తు లు తప్పనిసరి. మైలారం గ్రామస్థులకు ఎ లాంటి సమాచారం లేకుండానే గ్రామసభ తీర్మానం పొందినట్లుగా నకిలీ పత్రాలు
సృష్టించి తవ్వకాలకు అనుమతులు పొందినట్లు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల అండ, బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో మైనింగ్ మాఫియా అనుమతులు పొందినట్లు తెలుస్తున్నది. దీనికి ప్రస్తుత ప్రజాప్రతినిధులు కూడా మద్దతునిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
పక్షులు, జీవరాశులు, మూగ జీవాలు సంచరించే ప్రాంతాలతోపాటు, భక్తులు నిత్యం కొలిచే పురాతన చరిత్ర కలిగిన లక్ష్మి నర్సింహుడి, ఆంజ నేయ స్వామి, గ్రామ దేవతల ఆలయాలు సైతం నేలమట్టమయ్యేలా మైనింగ్ శాఖ అనుమతులివ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
మైనింగ్ శాఖ అక్రమ అనుమతులు
మైనింగ్ శాఖా అధికారులు మొదటగా 2018లో మైలారం గుట్టపై తవ్వకాలకు అనుమతులివ్వడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో అప్పటి మైనింగ్ అధికారులు గ్రామస్థుల అభ్యంతరాల నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. దీంతో మట్టి మాఫియా ఈ ప్రాంతంలోని విలువైన రాతిని తవ్వాలన్న కుట్రలో భాగంగా గ్రామస్థులు తీర్మాణం ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించినట్లు తెలిసింది.
అనంతరం కొద్ది రోజులకే రాజకీయ నేతల సహకారంతో 27 మార్చి 2021న మైలారం గుట్టపై తవ్వకాలు జరిపేందుకు గ్రామస్థులకు, అటవీ శాఖకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ మైనింగ్ అధికారులు నివేదించినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో 10 అక్టోబర్ 2041 వరకు తవ్వకాలు జరిపేందుకు 11 అక్టోబర్ 2021న మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చింది.
ప్రజాప్రతినిధుల అండ
కనురెప్ప వాల్చే పరిస్థితి లేకుండా భీకరమైన శబ్దాలు, ఊరినిండా దుమ్ము, ధూళితో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. తమ స్థిరత్వాన్ని కోల్పోతున్నామని గగ్గోలు పెడుతూ ఆరేండ్లుగా నిరసనలు చేపడుతున్నారు. అయినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. బీఆర్‌ఎస్ హయాం లో గుట్టను ధ్వంసం చేయడానికి వచ్చిన హిటాచీలు, వాహనాలను గ్రామస్థులు అడ్డుకున్నారు.
అప్పుడు కాంగ్రెస్ నేతలు మద్దతు గానే ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే మైనింగ్ తవ్వకాలను పూర్తిగా నిలిపేస్తామంటూ హామీలు కూడా గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అక్రమ మైనింగ్‌ను ఆపలేకపోతున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమా మహేశ్వర ప్రాజెక్టుపై ఎఫెక్టు
మైలారం గుట్ట తవ్వకాల వల్ల గుట్ట పూర్తిగా ధ్వంసం అవుతున్న నేపథ్యంలో నల్లమల్ల అటవీ ప్రాంతాల ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మించతలపెట్టిన ఉమామహేశ్వర లిఫ్టు ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారనుంది. గుట్టలను అను సంధానంగా నీటి నిల్వ చేసేందుకు రిజర్వాయర్ నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసింది. గుట్ట పూర్తిగా ధ్వంసమైతే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం కష్టమే.
పార్లమెంట్ ఎన్నికలకు దూరం
గత పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామస్థులు మైనింగ్ అనుమతులు రద్దు చేస్తేనే ఓట్లేస్తామని తేల్చి చెప్పారు. దీంతో 783 ఓట్లకుగాను కేవలం 10 మంది మాత్రమే ఓటేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కాంట్రాక్టర్లు గుట్ట పై తవ్వకాల కోసం గుట్టపైకి భారీ రోడ్లు వేసుకున్నారు.
అనేక రకాల మొక్కలను తొలగించారు. అత్యంత విలువైన క్వర్డ్, ఫిల్డే స్పర్ దొరుకుతుండటంతో మైనింగ్ మాఫియా గుట్టను ధ్వంసం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న ఆలయాలకు, శ్మశానాలకు వెళ్లనివ్వకుం డా గ్రామస్థులను అడ్డుకోవడంతో పాటు పోలీసుల పహారాతో తవ్వకాలు చేపడుతున్నారు.
పర్యావరణానికి భారీ ముప్పు
నల్లమల్ల అభయారణ్యానికి దగ్గరగా ఉన్న ఈ గుట్టపై ఔషధ మొక్కలతో పాటు జాతీయ పక్షులు, మూగజీవాలు కూడా సంచరించేవి. గుట్టపై ప్రతాపరుద్రుడు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. మైనింగ్ తవ్వకాలతో ఈ ప్రాంతం పూర్తిగా నేలమట్టం అయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మూడు గ్రామాలకు కలిపి దాదాపుగా 3 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే గుట్ట పక్కన గల చెరువు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
గడ్డం లక్ష్మణ్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు