30-03-2025 12:23:22 AM
ఒక్క మయన్మార్‌లోనే 1,644 మందికిపైగా మృతి..
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
యూఎస్‌జీఎస్ ప్రకారం మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం
మరో మూడుసార్లు కంపించిన భూమి
ప్రగాఢ సంతాపం తెలియజేసిన ప్రధాని మోదీ
ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించిన భారత్
మయన్మార్‌కు ప్రపంచదేశాల ఆపన్నహస్తం
మరణించిన వారిలో భారతీయులు లేరు: భారత విదేశాంగ శాఖ
నేపిడా, మార్చి 29: భూకంపాల కారణంగా మయన్మార్, థాయ్‌లాండ్‌లో మరణించిన వారి సంఖ్య 1,600 దాటింది. ఒక్క మయన్మార్‌లోనే 1,644 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు ౩,౪00 మంది గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టుగా అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే భూకంప ధాటికి రోడ్లు, వంతెనలు భారీగా ధ్వంసం కావడంతో చాలా ప్రాంతాలకు రెస్క్యూ సిబ్బంది చేరుకోవడం సవాలుగా మారినట్టు తెలుస్తోంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాం కాక్‌లో 30 అంతస్థుల భారీ భవంతి కూలిన ఘటనలో తొమ్మిది మంది మరణించారు. సుమారు 100 మంది జాడ గల్లంతైంది.
భూకం పం కారణంగా తమ భవనాలకు పగుళ్లు వచ్చినట్టు నగర వ్యాప్తంగా 2000 ఫిర్యాదులు అందాయని బ్యాంకాక్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ఒక్క భవనం మాత్రమే భూకంప ధాటికి కుప్పకూలిందని బ్యాంకాక్ గవర్నర్ చాద్‌చార్ట్ సిట్టిపుంట్ ప్రకటించారు. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది ఆచూకీని రెస్క్యూ టీమ్ గుర్తించిందన్నారు. ఈ క్రమంలో వారి ప్రాణాలను రక్షించేం దుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. బ్యాంకాక్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొన సాతున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా థాయ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. శిథిలాల కింద సుమారు 40 మంది చిక్కుకుని ఉంటారని థాయ్‌లాండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉం టే ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా జియోలాజిక్ సర్వే సంస్థ(యూఎస్‌జీఎస్) అంచనా వేసింది.
మరో మూడుసార్లు భూ ప్రకంపనలు
మయన్మార్‌లో శనివారం కూడా భూమి మూడుసార్లు కంపించింది. ఉదయం 11.53 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30, 2.50 గంటలకు వరుసగా 3.8, 4.7 తీవ్రతతో మయన్మార్‌లో భూమి కంపించినట్టు భారత్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. విస్తృతంగా సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో భూమి ప్రకంపించడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం
భూవిలయం కారణంగా మయన్మార్ అతలాకుతలమైన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వాధినేత మిన్ ఆంగ్ హ్లుంగ్‌తో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసినట్టుగా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ వెల్లడించారు. ‘సీనియర్ జనరల్ హెచ్‌ఈ మిన్ ఆంగ్ హ్లుంగ్‌తో మాట్లాడా. విపత్తులో జరిగిన ప్రాణ నష్టంపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశా. సన్నిహిత మిత్రుడిగా భారత్ ఈ క్లిష్ట సమయంలో మయన్మార్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది’ అని ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.
ఆపరేషన్ బ్రహ్మ ప్రారంభించిన భారత్
విపత్కర పరిస్థితిలో మయన్మార్‌కు ఆపన్నహస్తం అందించడానికి భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ ను ప్రారంభించింది. ఆ ఆపరేషన్‌లో భాగంగా సోలార్ ల్యాంపులు, ఆహార ప్యాకెట్లు, కిచెన్ సెట్ల తో కూడిన 15 టన్నుల సహాయ సామగ్రిని భార త్ ప్రత్యేక విమానంలో మయన్మార్‌కు పంపింది. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 80 మంది సిబ్బందితో కూడిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృం దం నేపిడాకు బయల్దేరింది. మరో 118 మందితో కూడిన భారత ఆర్మీ బృందం క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు అందించడానికి మయన్మార్‌కు వెళ్లేందుకు సిద్ధమవు తోంది. దీనికి అదనంగా ఐఎన్‌ఎస్ సాత్పుర, ఐఎన్‌ఎస్ సావిత్రి నౌకల ద్వారా మరో 40 టన్నుల మానవతాసాయాన్ని మయన్మార్‌కు పంపింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు మయన్మార్‌లో భారతీయులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ముందుకొచ్చిన ప్రపంచ దేశాలు
మయన్మార్‌ను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. 82 మందితో కూడిన రెస్క్యూ బృందాన్ని మయన్మార్‌కు చైనా పంపించింది. అలాగే 13.8 మిలియన్ డాలర్ల అత్యవసరసాయాన్ని ప్రకటించింది. విపత్తు పట్ల సంతాపం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మయన్మార్‌కు అమెరికా సహా యం చేస్తుందని ధ్రువీకరించారు. అత్యవసర సహాయ కార్యక్రమాలకు మద్దతుగా 2 మిలియన్ డాలర్ల మనవతా సహాయ ప్యాకేజీని దక్షిణ కొరి యా ప్రకటించింది. సహాయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు 50 మంది రెస్క్యూ సిబ్బందిని మలేషియా ప్రభుత్వం మయన్మార్‌కు పంపించింది. గాయపడిన వారికి చికిత్స అందించడం కోసం దుబాయిలోని లాజిస్టిక్ హబ్ నుంచి ప్రాథమిక చికిత్స పరికరాలను డబ్ల్యూహెచ్‌ఓ సమీకరిస్తోంది. వీటితోపాటు మయన్మార్‌ను ఆదుకునేందుకు ఇరాన్, ఇండోనేషియా దేశాలూ ముందుకొచ్చాయి.