29-03-2025 02:02:12 AM
వణికించిన భూకంపాలు 153 మందికి పైగా మృతి
కళ్లముందే పేకమేడల్లా కూలిన ఆకాశహర్మ్యాలు, గుళ్లు, గోపురాలు
మృతుల సంఖ్య వేలల్లో?
సైరన్ల మోత.. భయంతో జనం పరుగులు
బ్యాంకాక్‌లో 7.3, 6.4 తీవ్రత.. 9మంది మృతి
భారత్ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ
మయన్మార్, థాయ్‌లాండ్‌లు వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోయాయి. శుక్రవారం 12నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భారీ భూకంపాలు సంభ వించడంతో మయన్మార్, బ్యాంకాక్‌లో పలు బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రాణభయంతో ప్రజలు హాహాకారాలు చేస్తూ వీధుల్లోకి, పార్కుల్లోకి పరుగులు తీశారు.
మయన్మార్‌లో 1000 పడకల ఆసుపత్రి, పలు భారీ భవనాలు, మసీదులు, గుళ్లు గోపురాలు కుప్పకూలాయి. ఈ భూకంపాల బారినపడి దాదాపు 153 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 800 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో తొలుత భూమి భారీగా కంపించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరో రెండుసార్లు భూమి కంపించింది.
సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా నగరానికి తూర్పున 50 కి.మీ. దూరంలో 10కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. మయన్మార్‌లో భూకంప తీవ్రత గరిష్ఠంగా 7.7 నమోదైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన నేపథ్యంలో సహాయం అందించాలని మయన్మార్ సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. మయన్మార్‌కు పొరుగున ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భూమి రెండుసార్లు కంపించింది.
బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3, 6.4గా నమోదైంది. బ్యాంకాక్‌లో పలు భవనాలు కుప్పకూలాయి. నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం కళ్లముందే పేకమేడలా కూలడంతో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పో గా సుమారు 90 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
థాయ్‌లాండ్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపం దాటికి రెండు దేశాల్లో రోడ్లు భారీగా చీలిపోయాయి. మయన్మార్, థాయ్‌లాండ్‌కు అండ గా ఉంటామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు.