02-04-2025 12:13:37 AM
నేపిడా, ఏప్రిల్ 1: మయన్మార్‌లో భూకంప మృతుల సంఖ్య 2,719కి చేరింది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 3,000 దాటే అవకాశం ఉందని మయన్మార్ ఆర్మీ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 4,521 మంది క్షతగాత్రులను గుర్తించగా.. ఇప్పటికీ 441 మంది ఆచూకీ లభించలేదని మిలటరీ లీడర్ మిన్ ఆంగ్ హ్లేంగ్ తెలిపారు.
సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయినా కానీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మయన్మార్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకువచ్చాయి. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నాయి.
భూకంప బాధితులకు నివాళి అర్పించేందుకు మంగళవారం మయన్మార్ వ్యాప్తంగా నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య ఎంత దూరం వెళ్తుందో అని అంతా ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజులు ఎంత దుర్భరంగా ఉండబోతున్నాయో అని చింతిస్తున్నారు.