calender_icon.png 1 April, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూకంప విలయాలు

29-03-2025 12:00:00 AM

శుక్రవారం సంభవించిన భారీ భూకంపాల ధాటికి మయన్మార్, థాయిలాండ్ దేశాలు విలవిలలాడుతున్నాయి. కూలిన ఎత్తయిన భవనాల మధ్య చిక్కుకుని హాహాకారాలు చేస్తున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే వీరిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడతారో అనుమానమే.  క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ముందుకు వచ్చింది. మయన్మార్‌లో ఒక్క రోజులోనే ఆరు సార్లు భూమి తీవ్రంగా సంభవించిందంటే భూకంపాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా మయన్మార్‌లో వచ్చిన భూకంపం అత్యంత శక్తివంత మైనదని అమెరికాలోని జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఇటుంటి భూకంపమే టర్కీ, సిరియాలో సంభవించగా భారీగా ప్రాణనష్టం సంభవించింది.

ముఖ్యంగా మయన్మార్,థాయిలాండ్ జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలు కావడంతో వీటిని రెడ్‌ఈవెంట్లుగా వ్యవహరిస్తామని ఆ శాస్త్రజ్ఞులు వెల్లడించా రు. రెండేళ్ల క్రితం టర్కీ, సిరియాల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 53 వేల మంది మరణించారు. ఇప్పుడు మయన్మార్‌లో సంభవించిన భూకంపం కూడా అంతే తీవ్రతతో కూడినది అయినందున ఇక్కడ కూడా భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశముందని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ పేర్కొంది. వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో మయన్మార్ ఒకటి. సాధారణంగా భూమి పైపొరల్లో అనేక ఫలకాలు (టెక్టానిక్ ప్లేట్స్) ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. ఇండియన్ టెక్టానిక్ , బర్మా మైక్రోప్లేట్‌కు మధ్య దాదాపు 1200 కిలోమీటర్ల ప్రదేశం మయన్మార్‌లో ఉంది. దీన్ని సగాయింగ్ ఫాల్ట్ అంటారు. ఈ ఫాల్ట్ కారణంగానే మయన్మార్‌లో చాలాసార్లు భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. 

గత వందేళ్లలో మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతకంటే ఎక్కువ ఉండే భూకంపాలు 14 సంభవించాయి. శుక్రవారం ఒక్క రోజే ఆరు భూకంపాలు నమోదు కాగా అత్యంత తీవ్రమైంది 7.7, అత్యల్పమైంది 4.3గా ఉంది. అయితే ఒక సారి తీవ్రమైన భూకంపం సంభవించిన తర్వాత తక్కువ తీవ్రతతో భూమి కంపించినా నష్టం భారీగానే ఉండే ప్రమాదం ఉంది. అంతేకాదు, భూంపం కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులోనే ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాంక్‌లో ఎత్తయిన భవనాలు ఎక్కువగా ఉండడం, చాలా భవనాలు కూలిన నేపథ్యంలో ఈ భయాలు ఎంకా ఎక్కువవుతున్నాయి.

నగరంలో చాలా రహదారులకు పగుళ్లు వచ్చాయి. బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పగుళ్ల కారణంగా దాన్ని పూర్తిగా మూసివేశారు. 2004లో ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో సముద్రంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా వచ్చిన సునామీ కాణంగా భారత్ సహా 14 దేశాల్లో  2 లక్షల మందికి పైగా మృతి చెందగా అపారమైన ఆస్తినష్టం సంభవించడాన్ని జనం ఇప్పటికీ మర్చిపోలేదు.ఏటా ప్రపంచ వ్యాపతగా వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే వీటిలో తీవ్రత తక్కువగా ఉండేవే ఎక్కువ. భారీ భూకంపాలు ఎప్పుడు ఎక్కడ సంభవించినా నష్టం కనీవినీ ఎరుగని రీతిలోనే ఉంటుంది. ప్రాణనష్టం తక్కువగా ఉండే విధంగా ఆగ్నేయాసియా దేశాల్లో భవనాల నిర్మాణం జరిగినా అది కొంతమేరకే ఆదుకొంటుందనేది నిపుణుల అభిప్రాయం. ప్రకృతి సృష్టించే ఇలాంటి విపత్తులను ముందుగా ఊహించడం ఎవరివల్లా కాదు. ప్రపంచ దేశాలు ఉదారంగా ఆదుకుంటే తప్ప జరిగిన నష్టంనుంచి ఆ దేశాలు కోలుకోవడం సాధ్యమూ కాదు.