09-02-2025 12:15:48 AM
ఈ జనరేషన్ మహిళలు ‘నా దారి రహదారి’ అంటూ దూసుకుపోతున్నా రు. కష్టసాధ్యమైన డ్రైవింగ్ ఫీల్డ్‌లోనూ రాణిస్తున్నారు. ట్రక్కులు, లారీలు, బస్సులు.. ఏదైనా సరే గేర్ మార్చి దేశాలను చుట్టేస్తున్నారు. కేరళకు చెందిన జలజ అనే మహిళ లారీ డ్రైవర్‌గా మారి అనేక ప్రాంతాలను చుట్టేశారు. కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్‌ఫోర్ట్ యజమాని. అతని సంస్థలో 30 లారీలు ఉన్నాయి.
రతీష్ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్‌తో కలిసి ట్రక్కులో కాశ్మీర్‌కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్ చేయాలనే ఆసక్తి కలిగింది. 2014లో ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది.
మొదటిసారి పెరుంబవూరు నుంచి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు.
కాశ్మీర్ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల గుండా లారీ నడిపా’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారామె.