హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ సెక్రటేరియట్లో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం కింద ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అనే దాశరథి మాటల్ని పొందుపర్చాలని దాశరథి కూతురు ఇందిర, అల్లుడు గౌరీశంకర్ కోరారు. మంగళవారం మహాకవి దాశరథి కృష్ణమాచార్య 37వ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో కార్యదర్శి నామోజు బాలాచారి అధ్యక్షతన సభ నిర్వహించారు.
ఈ సభకు దాశరథితో అనుబంధం కలిగిన అనేకమంది సాహితీవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాశరథి రాసిన కథలను ఏరి కూర్చి ‘నిప్పు పూలు’ పేరుతో అకాడమీ ఓ కథ సంపుటిని వెలువరించింది. సభలో నందిని సిధారెడ్డి, టీ ఉడయవర్లు, ఆనందాచారి, శరత్చంద్ర, రూప్ కుమార్ డబ్బికారు, ఆచార్య పిల్లలమర్రి రాములు, గంటా మనోహర్ రెడ్డి, కే ప్రభాకర్, ఆచార్య డాక్టర్ ఎస్ రఘు తదితర సాహితీవేత్తలు పాల్గొన్నారు.