calender_icon.png 23 October, 2024 | 11:36 AM

నా కుమారుడిని అన్యాయంగా ఇరికించారు

23-10-2024 12:10:29 AM

  1. రేణుబాబు హత్యకేసులో నాకు అనుమానాలున్నాయి
  2. సమగ్ర దర్యాప్తుతోనే నిజాలు బయటికి వస్తాయి
  3. సాయివర్షిత్ తల్లి జయశ్రీ ఆవేదన

రాజేంద్రనగర్, అక్టోబర్ 22: తాపీమేస్త్రీ రేణుబాబు హత్య కేసును పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని, ఈ కేసులో తనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని హత్య కేసులో ప్రధాన నిందితుడైన సాయివర్షిత్ తల్లి జయశ్రీ డిమాండ్ చేశారు. మంగళవారం రాజేంద్రనగర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు.

తన భర్త చనిపో వడంతో కుమారుడు సాయివర్షిత్‌తో కలిసి కిస్మత్‌పూర్ వీకర్ సెక్షన్ కాలనీలో ఉంటున్నట్లు తెలిపింది. సాయివర్షిత్ కొన్నాళ్లుగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, పలుమార్లు ఆస్పత్రుల్లో కూడా చూపించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 31న తాపీమేస్త్రీ రేణుబాబు హత్యకు గురయ్యాడని.. ఆగస్టు 1న తన కుమారుడిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారన్నారు.

కాళీమందిర్‌కు చెందిన కృష్ణ తన కుమారుడి క్లాస్‌మెట్ అని, అతడి స్నేహితులు విశాల్, మహేందర్, సోను, సందీప్‌కు.. హత్యకు గురైన రేణుబాబు భార్యతో వివాహేతర సంబంధం ఉందని.. ఈనేపథ్యంలోనే అతడిని చంపేసి ఉండొచ్చని ఆరోపించింది.

హత్య జరిగిన రోజు సాయివర్షిత్‌ను అతడి కుమారులు తమ ఇంటి వద్ద బైకుపై దింపి వెళ్లారని, అయితే ఈకేసులో పోలీసులు సమగ్ర విచారణ జరపకుండా తన కుమారుడిపైనే కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కృష్ణ, అతడి స్నేహితులు తన కుమా రుడికి రూ.50 లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పారని..

తామే జైలునుంచి తీసుకొస్తామని చెప్పడంతో సాయివర్షిత్ హత్య చేసినట్లు అంగీకరించాలని బెదిరించారని.. ఈ విషయం జైలులో ఉన్న తన కుమారుడు తనకు చెప్పాడని చెప్పింది. రాజేంద్రనగర్ ఏసీపీ, డీసీపీ ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయించి తనకు న్యాయం చేయాలని సాయివర్షిత్ తల్లి వేడుకుంటోంది.