ధర్మ, ఐశ్వర్యశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించారు. డిసెంబర్ 27న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.
ఈ సందర్భంగా మూవీ టీమ్ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశ మైంది. ఈ ప్రెస్‌మీట్‌లో హీరో ధర్మ మాట్లాడుతూ.. “డ్రింకర్ సాయి సినిమాను ఆదరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో యువ హీరోగా నాకో స్థానం కల్పించారు ప్రేక్షకులు. కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఉండదనే మాట తప్పు అని రుజువు చేశారు. శ్రేయోభిలాషులు చెప్పినవన్నీ మనసులో ఉంచుకుని భవిష్యత్తు ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటాను” అన్నారు.
డైరెక్టర్ కిరణ్ మాట్లా డుతూ.. “డ్రింకర్ సాయి’కి ప్రేక్షకుల ఆదరణ దక్కడం ఆనందాన్నిచ్చింది” అని తెలిపారు. ప్రొడ్యూసర్ లహరీధర్ మాట్లాడుతూ.. “డ్రింకర్ సాయి’ కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటిదాకా రూ.5.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం ఆనందాన్నిచ్చింది” అని చెప్పారు. డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో మా డైరెక్టర్ చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది’ అన్నారు.