21-03-2025 12:00:00 AM
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో దక్కిన గౌరవంపై స్పందించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఘన సత్కారం దక్కింది. అదే సమయంలో యూకేకు చెందిన బ్రిడ్జి ఇండియా అనే ప్రఖ్యాత సంస్థ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు చిరంజీవి. పలువురు మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, దౌత్యవేత్తలతో సహా అనేక ప్రముఖ వ్యక్తుల సమక్షంలో చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్‌లోని కొందరు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అండర్ సెక్రటరీలు, దౌత్యవేత్తల చే గౌరవించబడటం గౌరవంగా భావిస్తున్నాను. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.
సభ్యులు నాపై గౌరవ భావాన్ని చూపిస్తూ మాట్లాడిన మాటలకు నేను ధన్యుడిని. బ్రిడ్జి ఇండియా బృందం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవటం నన్నెంతగానో ఉత్సాహపరిచింది” అని రాసుకొచ్చారు. ‘మాటలు సరిపోవు. అద్భుతమైన ప్రేమాభిమానాలను చూపించే అభిమానులు, రక్తదాతలు, నా సినీ కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులు, నా కుటుంబ సభ్యులు అందరూ నా ప్రయాణంలో ఎంతగానో సహకరించినవారు, నేను మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు.