calender_icon.png 7 March, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా మొదటి కండువా బీజేపీదే

11-12-2024 02:31:43 AM

* ఎక్కడున్నా బీసీలకోసమే పోరాడతా

*రాజ్యసభకు నామినేషన్ వేసిన ఆర్ కృష్ణయ్య

*మూడు స్థానాలకు ముగ్గురే పోటీ.. ఎన్నిక లాంఛనమే

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఇప్పటి వరకు పలు పార్టీల్లో పనిచేసినా తాను వేసుకున్న మొదటి కండువా మాత్రం బీజేపీదేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు స్థానాలకు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, టీడీపీ తరఫున బీద మస్తాన్‌రావు, సానా సతీశ్‌బాబు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణికి వారు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు.

మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల ప్రతినిధులుగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్‌యాదవ్, కె.అచ్చన్నాయుడు, పి.నారా యణ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒక్కో రాజ్యసభ సభ్యుడి నామినేషన్‌కు పదిమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉండగా.. అసెంబ్లీకి 40 మంది ఎమ్మెల్యేలు వచ్చి బలపరిచారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఏపీ సీఎం చంద్రబాబుతో కృష్ణయ్య భేటీ అయ్యారు. 

బీజేపీ పిలిచి సీటు ఇచ్చింది..

నామినేషన్ వేసిన సందర్భంగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పిలిచి రాజ్య సభ సీటు ఇచ్చిందన్నారు. బీజేపీ తనకు కొత్త కాదని.. తాను మొదటగా కండువా కప్పుకున్నది ఆ పార్టీదేనని అన్నారు. అన్ని పార్టీలు బీసీలకు న్యాయం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 50 ఏళ్లు బీసీల కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు. వైసీపీకి పార్టీలో మాట్లాడే అవకాశం తక్కువ అని.. బీసీల గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందనే పార్టీ మారానని తెలిపారు.