26-03-2025 12:17:54 AM
హీరో నితిన్ నుంచి వస్తున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీలీల విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
* ఇందులో నా పాత్ర పేరు నీరా వాసుదేవ్. ఫారిన్ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయే నీరా. ఎప్పుడూ తన సొంత ప్రపంచంలోనే ఉంటుంది. ఈ ప్రపంచమంతా తన చుట్టే ఉంటుందని అనుకుంటుంది. చాలా క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్. నాకు చాలా నచ్చింది.
* నిజానికి ఈ పాత్ర కోసం ముందు రష్మికను అనుకున్నారు. ఆమెకు చాలా నచ్చిన క్యారెక్టర్ ఇది. డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేకపోయారు. ‘పుష్ప’ షూటింగ్‌లో కలిసినప్పుడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
* నితిన్‌తో పనిచేయడం ఇది రెండోసారి. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సౌకర్యంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఓ కుటుంబ సభ్యుడిలాగానే మసులుకుంటారాయన. ఈ సినిమాతో నితిన్, నేను హిట్ పెయిర్ అనే పేరు తెచ్చుకుంటామనిపిస్తోంది.
* ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ ట్రాక్ గురించి చెప్పాలి. వాళ్ల ట్రాక్ షూట్ చేస్తున్నప్పుడే పడీపడీ నవ్వాం. కిషోర్ కామెడీని చాలా ఎంజాయ్ చేశా. మా ఇద్దరి మధ్య సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. రాజేంద్రప్రసాద్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీ అదిరిపోతుంది. నా కెరీర్‌లో కంప్లీట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే సినిమా ఇది.
* నేను మైత్రి ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి గర్వపడతా. ఈ బ్యానర్‌లో ఇంటి సినిమా చేస్తున్నంత హ్యాపీగా ఉంటుంది.
* నిరుడు నా సినిమాలు నెలకు ఒకటి రిలీజ్‌కు వచ్చింది. ఒక్కో రోజు 4, 5 షిఫ్ట్లులు పనిచేశా. అలా ప్లాన్ చేయడానికి కూడా కారణం ఎడ్యుకేషన్‌లో ఫైనల్ ఇయర్‌లో ఉండటమే. ఏడాది బ్రేక్ తీసుకుంటానని నాకు ముందు నుంచే అంచనా ఉంది. అయితే ఈ గ్యాప్‌లో చాలా మంచి సినిమాలు చేయలేక వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మెడిసిన్ పూర్తయింది. కాలేజీ రూల్స్‌కు తగ్గట్టుగా అటెండ్ అవుతున్నా.
* నేను చేసిన సినిమాల్లో క్యారెక్టర్ గుర్తుపెట్టుకోవడం చాలా అరుదు. ‘భగవంత్ కేసరి’ తర్వాత అందరూ విజ్జి పాప అని పిలుస్తుంటే మహా ఆనందంగా ఉండేది. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చేస్తూనే అలాంటి మంచి మెసేజ్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నా.
* నేను బాలీవుడ్‌లో కనిపించిన ప్రతిసారి అక్కడికే షిఫ్ట్ అయిపోతున్నానేమో అనుకుంటున్నారు. ఎప్పటికీ అలా జరగదు. అది అసాధ్యం. ఎందుకంటే -తెలుగు ఇండస్ట్రీ నాకు ఇల్లు లాంటిది.
* నా కొత్త సినిమాల సంగతులు చెప్పాలంటే.. ‘-పరాశక్తి’ సినిమా చేస్తున్నా. రవితేజతో ‘మాస్ జాతర’ చేస్తున్నా. కన్నడ, -తెలుగులో జూనియర్ సినిమా చేస్తున్నా. ఇంకొన్ని సినిమాలూ ఉన్నాయి. వాటిని మేకర్స్ అనౌన్స్ చేస్తారు” అని చెప్పింది శ్రీలీల.