calender_icon.png 5 November, 2024 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా అన్నయ్య

04-11-2024 12:00:00 AM

రేపు దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి :

అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య :

“దేశే దేశే కళత్రాని, దేశే దేశేచ బాంధవాః తంతు దేశం నాపశ్యామి యత్ర భ్రాత సహోదరః” అని విలపిస్తాడు, లక్ష్మణుడు మూర్ఛ పోయినందుకు రాముడు. మరి మా అన్నయ్య, నా రాముడు దాశరథి కవితా శరధి మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాడు. దుఃఖంలో ముంచిపోయాడు. నా గుండెలో చీకట్లు నింపి తిమిరంతో సమరం జరపడానికి వెళ్ళిపోయాడు.

మా అన్నయ్య చనిపోయాడంటే -అతని పార్థివ శరీరాన్ని నేనే అగ్నికి ఆహుతి చేయించానంటే నా మనసు నన్నే నమ్మడం లేదు.

తెల్లని ధోవతి ధరించి, కాలరు లేని పొడుగు చేతుల చొక్కా వేసుకుని, చేతిలో బ్రీఫ్‌కేసు పట్టుకుని మా ఇంటి దర్వాజాలో నుంచొని “తమ్ముడూ” అని పిలుస్తున్నట్టనిపిస్తున్నది. మా అన్నయ్య ఇంకా మాట్లాడ్తాడనీ, ఏ విషయాన్ని అయినా, ఎవరితోనయినా గంటల తరబడి మాట్లాడేవారు మరణించడం అసాధ్యం అనుకుంటుంది మనసు.

20 సెప్టెంబరు నాడు మా అన్నయ్యను ఆస్పత్రిలో చేర్పించారని ఫోను వచ్చింది. నేను కదిలే స్థితిలో లేను. డాక్టర్‌ను అడిగాను. “మీ ఆరాటం చూస్తుంటే మీరు వెళ్ళడమే మంచిది” అన్నాడు. కమలా, నేను వెళ్ళాం, మా పిల్లవాడు విరించి అక్కడే వున్నాడు. నన్ను మా అన్నయ్య ఉన్న గదికి తీసికెళ్ళాడు.

మంచం మీద దిండ్లు ఆనించి కూర్చోపెట్టారు. ఆక్సిజను వగైరా గొట్టాలతో కట్టివేసినట్లున్నాడు. అన్నయ్యను చూచాను. నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. పెద్దగా ఏడ్చేశాను. అన్నయ్య కళ్ళు తెరిచాడు. “తమ్ముడూ!” అన్నాడు. నా గుండె అవిసిపోయింది. నర్సులు వచ్చారు. నన్ను బయటకు నడిపించారు.

మా అన్నయ్యను నిజాం సైతం జైల్లో పెట్టగలిగాడు - కాని బంధించ లేకపోయాడు. జైలులోనే “వద్దంటే గద్దెనెక్కి పెద్దరికం చేస్తావా?” అని గర్జించాడు. అలాంటి సింహాన్ని ఆస్పత్రి బంధించింది. చూడలేక పోయాను. ఎంతోసేపు విలపించాను.

9 అక్టోబరునాడు మళ్ళీ ఆస్పత్రికి వెళ్ళాను. అన్నయ్య నన్నూ, మా అమ్మాయి ఉదయశ్రీని పట్టుకుని పెద్దగా ఏడ్చాడు. మా అన్నయ్య కన్నీరు రాల్చడం అంతకు ముందు నేను చూడలేదు. మా అమ్మ పోయినప్పుడూ, నాయన పోయినప్పుడూ కూడా అన్నయ్య ఏడవలేదు.

అన్నయ్య దుఃఖం చూచి నా మనసులో దుఃఖం పొంగింది. కాని దిగమింగాను. “అన్నయ్యా నీలాంటి వాడికి ఇది తగదు. ధైర్యంగా వుండాలి” అన్నాను. “తమ్ముడూ! నాకు ధైర్యం లేదురా! పోయింది.. పోయింది” అని మళ్ళీ ఏడ్చాడు. ఆ మాటా, ఈమాటా చెప్పి ఓదార్చ గలిగాను. కాని బయటికి వచ్చి నేను భళ్ళుమన్నాను.

ఇప్పుడు ఏరీ, ఎవరు నాతో చెప్పుకుని ఏడ్చేవారు, మనసు నా ముందు, భళ్ళున గుమ్మరించేవారు! మా అన్నయ్య వెళ్ళిపోయాడు! మళ్ళీ రాకుండా వెళ్ళాడు.

అన్నయ్య ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాడు. నేను, కమలా వెళ్ళాం. అస్పత్రిలో కంటే బావున్నాడు. పూర్వం వలె కాకున్నా, సరదాగానే మాట్లాడాడు. “మరదలు వచ్చిందంటే ఆపిల్స్ తెచ్చిందన్నమాటే, చెక్కు తీసి కోసి పెట్టమ్మా!” అన్నాడు. అన్నయ్య మాటల్లో దుఃఖపు తడి కనిపించింది.

కమల ఆపిల్ చెక్కు తీసి ముక్కలు కోసి పెట్టింది. “తమ్ముడూ! ఈ ఊపిరితిత్తుల్లో నీరు ఎప్పుడు వచ్చిందో తెల్సుగా, 1940లో ఖమ్మం హీరాలాల్ ఇంట్లో, నువ్వు నా మూత్ర పురీషాలు ఎత్తిపోశావు” అని గతాన్ని తోడిపోశాడు. ఆపిల్ ముక్కలు ఒక్కటే తిన్నాడు. “అందరికీ ఆపిల్స్ సెలెక్ట్ చేయడం చేత కాదురా!” అన్నాడు.

మా అన్నయ్య బాగవుతున్నాడు. కోలుకుంటున్నాడు. మళ్ళీ కొద్దిరోజుల్లో మా ఇంటికి వస్తాడు. “తమ్ముడూ!” అని పిలుస్తాడు. మా ఇంట్లో ఆపిల్ తింటాడు. చాయ్ తాగుతాడు. లోకంలో ముచ్చట్లన్నీ చర్చిస్తాడు అనుకున్నాను. కాలేదు. బాగు కాలేదు. మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోయాడు. ఆశలన్నీ అడియాశలు చేసి వెళ్ళిపోయాడు.

1-.11-.87 ఆదివారం నాడు నేనూ, కమలా వెళ్ళాం. అన్నయ్య నిద్రలో వున్నాడంటే బయటనే కూర్చున్నాం. గ్రహించాడు మేం వచ్చామని. “తమ్ముడూ” అని పిలిచాడు. వెళ్ళాం. నన్ను తన మంచం మీదనే కూర్చోమన్నాడు. తాను లేచి కూర్చున్నాడు. ఇదివరకు చూచినప్పటికీ, ఇప్పటికీ బాగున్నాడు.

తాను ఇదివరకు రాసినవి, రాయవలసిన వాటిని గురించి ముచ్చటించాడు. “అన్నయ్యా! నీ జబ్బు నయమైంది. ఇంక కోలుకోవాలి, అంతే- వారం పది రోజుల్లో బాగవుతావనుకుంటా. మేము మళ్ళీ వచ్చేసరికి కోలుకుని నడుస్తుంటావు” అన్నాను. “నేనూ, అదే అనుకుంటున్నాను. నాకు జబ్బు లేదు. నీరసమే వుంది. బాగయిపోతాను” అని ధైర్యం కనబరచాడు. నాకు చాలా సంతోషం కలిగింది. 

ఇంటికి వచ్చిన తరువాత అనుకున్నాను. మా అన్నయ్యకు అన్నీ మా నాయన లక్షణాలు వచ్చాయని. మా నాయన 1979వ సంవత్సరంలో తన 81వ సంవత్సరంలో పరమపదించారు. మా అన్నయ్య కూడా 81 సంవత్సరాలు జీవిస్తాడు అనుకున్నాను. అన్ని అంచనాలను తలక్రిందులు చేశాడు. అందని తీరాలకు వెళ్ళిపోయాడు.

కార్తీక పౌర్ణమి అందరికీ పర్వదినం. మాకది దుర్దినం. అన్నయ్య ఉదయం రక్తపరీక్ష కోసం డాక్టరు దగ్గరికి వెళ్ళివచ్చాడు. రెండు ఇడ్లీలు తిన్నాడు. కాస్సేపు నిద్రపోయాడు. లేచాడు. ఇన్సులిన్ ఇంజక్షను తీసుకున్నాడు. బాత్రూంకి వెళ్ళాడు. తలుపు వేసుకోవద్దని వాళ్ళమ్మాయి ఇందిర బయట నుంచుంది. కమ్మోడ్ మీది నుంచి పక్కనే వున్న నీళ్ళ బకెట్లో పడిపోయాడు.

ఇందిర “నాన్నా నాన్నా” అంటూ లోనికి వురికింది. ఇంకెక్కడి నాన్న! నాన్న ఎక్కడున్నాడు! ఎక్కడున్నాడమ్మా నాన్నా? నాన్న వెళ్ళిపోయాడు. ఏ లోకాల నుంచో పిలుపు వచ్చింది. వెళ్ళిపోయాడు. అందరినీ వదిలి వెళ్ళాడు. ఒంటరిగానే వెళ్ళాడు. అర్థం కాని చోటికి వెళ్ళిపోయాడు. మృత్యువు సైతం మా అన్నయ్య మందహాసాన్ని ఆర్పలేక పోయింది.

చావు తరువాత సైతం మా అన్నయ్య ముఖంలో మార్పు లేదు. అది వెలుగుతున్న దివ్వెలా వుంది. మా అన్నయ్యను యమపాశాలు బంధించినట్లు కనిపించదు. మృత్యుదేవి అతని అడుగులకు మడుగులొత్తి తీసుకెళ్లినట్టుంది. మరణాయాసం మా అన్నయ్య దరిచేరడానికి అదిరిపోయింది. మా అన్నయ్య శరీరం నిద్ర పోతున్నట్టుంది. కాళ్ళూ, చేతులూ కట్టెలవలె కాలేదు. మెత్తగానే వున్నాయి. ఏవో పనులమీద ఆ లోకాలకు వెళ్ళాడు. మరలి వస్తాడేమో అన్నట్టున్నాడు.

మా అన్నయ్య కల్లా కపటం ఎరుగని వాడు. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవాడు. అతడికి వేల సంఖ్యలో మిత్రులున్నారు. మా అన్నయ్య మానవతామూర్తి. ఆయన మనసులో, కళ్ళలో, కవితలో, హృదయంలో మానవత నిండి నిబిడీకృతం అయివుంది. మా అన్నయ్య నిజమైన కవి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా స్పందించేవాడు.

దాన్ని కవితామయం చేసేవాడు. మా అన్నయ్య గొప్పవక్త, సభలలో గంటల తరబడి అనర్గళంగా ఉపన్యసించేవాడు. ఉత్తరాలు రాయడంలో మా అన్నయ్యను మించినవాడు వున్నాడనుకోను. ఎవరు ఉత్తరం రాసినా వెంటనే జవాబు రాసేవాడు. కొంతమందికి వారి ఉత్తరం అవసరం లేకుండానే జవాబు రాసేవాడు.

వేల సంఖ్యలో జాబులు రాశాడు. మా అన్నయ్య హెచ్చుతగ్గులు ఎరుగడు. ప్రధానితోనూ, పసిపాపతోనూ ఒకే రకంగా మాట్లాడేవాడు. మా అన్నయ్య మహా మానవతావాద కవి. అతని కవితలు అగ్గి కురిపించగలవు, పూలవాన రాల్చగలవు. అతడు అన్యాయానికి శత్రువు. అందానికి మిత్రుడు. అతనిలో లావాను చూడవచ్చు. ఇంద్రధనుస్సులు అవలోకించవచ్చు.

మా అన్నయ్య మృత్యువును గెలిచిన మహాయోధుడు, అతడు అగ్నిధారలో వున్నాడు. రుద్రవీణలో వున్నాడు. తిమిరంతో సమరంలో వున్నాడు. గాలిబ్ గీతాల్లో వున్నాడు. మిత్రుల మనసుల్లో వున్నాడు. మా అన్నయ్య వున్నాడు. వుంటాడు, వుండి తీరుతాడు.

(డా.గంటా జలంధర్‌రెడ్డి సంపాదకత్వంలో 2014లో వెలువడిన ‘సాహిత్య ప్రపంచంలో దాశరథి’ సంకలనం నుంచి..)