calender_icon.png 1 April, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కలల ప్రాజెక్టు!

23-03-2025 12:00:00 AM

పెద్దపెద్ద కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకోవడంలోనూ ముందున్నారు హీనా పటేల్. ఓవైపు కుటుంబం, మరోవైపు బిజినెస్‌లో రాణిస్తూనే తనకు ఇష్టమైన అభిరుచుల్లో సత్తా చాటుతున్నారు. తన అభిరుచినే వ్యాపారంగా మలుచుకుని ఎందరికో ఉపాధి మార్గాన్ని చూపుతున్నారామె. అల్లికపై మక్కువతో తన డ్రీమ్ ప్రాజెక్టును సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు హీనా.. 

జీవితంలో అనుభవించిన మానసిక వేదనకు చేతి అల్లికలతో ఓదార్పును వెతుక్కున్నారు హీనాపటేల్. క్రమంగా అదే ఓ పెద్ద వ్యాపారంగా మారి ‘మ్యాజిక్ నీడిల్స్’ కంపెనీగా అవతరించింది. ఈ కంపెనీ వందల మంది మహిళలకు ఉపాధి కల్పి స్తున్నది. చేతితో త యారు చేసిన అల్లికలు, కుట్టు ఉత్పత్తుల ను విభిన్నంగా తయారు చేస్తూ ౩౦౦ మంది మహిళలకు స్థిరమైన జీవనోపాధిని అందిస్తున్నది. 2011లో హీనా జీవితంలో ఎంతో మా నసిక ఒడిదుడుకు లు ఎదుర్కొన్నారు.

మూర్ఛ వ్యాధి కారణంగా తన ఆరేండ్ల కూతురిని కోల్పోయారు. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. తర్వాత పిల్లల కోసం ఐవీఎఫ్ ద్వారా మళ్లీ గర్భం దాల్చడానికి ప్రయత్నించారు. ఫుల్లెర్టన్, ఐసీఐసీఐ బ్యాంకులో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన హీనా.. తన గర్భంలో కవలలు ఉన్నారని తెలిసిన తర్వాత ఉద్యోగం నుంచి విరామం తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె చిన్నతనంలో నేర్చుకున్న అల్లికలపై దృష్టిపెట్టారు. ఒకవిధంగా ఇది తనకు ఒక అభిరుచి అని హీనా అంటున్నారు.   

అల్లికలతో సాంత్వన 

‘ఒక షాప్‌లో కొన్ని సూదులు, నూలును కొన్నా. కుట్ల గురించి కొంత అవగాహన ఉండటంతో స్వెట్టర్ అల్లా. అలా క్రమంగా అల్లికలు కొనసాగించా. ఈ విధంగా అల్లికల్లోనే నాకు సాంత్వన లభించింది. నా పిల్లలకు రెండున్నరేండ్లు వచ్చిన తర్వాత ప్లేగ్రూప్ ప్రారంభించా. కొంతకాలం తర్వాత మళ్లీ అల్లికలపై దృష్టిపెట్టా. యూట్యూబ్ వీడియోల ద్వారా కుట్టు పని పూర్తిగా నేర్చుకొన్నాను. మానసికంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు అల్లికలే నాకు ఓదార్పునిచ్చేవి’ అంటున్నారు హీనా.  ప్రస్తుతం ఆమె ఏర్పాటుచేసిన సంస్థ దేశవ్యాప్తంగా  ఎంతోమంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నది. 

కొత్త కొత్త అల్లికలతో..

కొత్త కొత్త అల్లికలను పరిచయం చేసేందుకు హీనా ప్రయత్నించేవారు. హెడ్‌బ్యాండ్‌లు, క్యాప్‌లను కూడా తయారు చేయడం ప్రారంభిం చారు. వాటిని వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ చేయడం.. తన ఫ్రెండ్స్‌కి నచ్చడంతో వాటిని ఫేస్‌బుక్‌లో షేర్ చేయడం ప్రారంభించారు. భర్త కల్పేశ్ సహాయంతో ఒక ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేశారు. ఆ పేజీకి విపరీతమైన స్పందన వచ్చింది. అదే ఏడాది ఆమె పోస్టులను బేబీ అండ్ మామ్ కేర్ బ్రాండ్ ‘ఫస్ట్ క్రై’ గమనించి వాటిని తమ సైట్‌లో పెడతామని చెప్పారు. ఇది మ్యాజిక్ నీడిల్స్ పుట్టుకకు తొలి మెట్టుగా చెప్పవచ్చు.

ప్రముఖ వైబ్‌సైట్‌లలో ప్రాడక్ట్స్ 

బేబీ ఉత్పత్తుల నుంచి మొదలైన మ్యాజిక్ నీడిల్స్ ఇప్పుడు టీన్, వ యోజనుల వరకు చేరువవుతున్నా యి. ‘మేం ఒక మై లు రాయి నుంచి మరొక మైలురాయికి చేరుకున్నాం. ఇప్పుడు అమెజాన్, మింట్రా, నైనా ఫ్యాషన్‌లో మా ప్రాడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే నాణ్యమైన నూలు దొరకడమే మాకు సవాల్‌గా మారింది.

కంపెనీ ప్రారంభం నుంచి టర్కిష్ నూలుపై ఆధారపడకుండా ప్రీమియం నూలు బ్రాండ్ హాబీ స్టోర్‌ను ప్రారంభించాను. విదేశీ ఉత్పత్తులపై మనం ఎందుకు ఆధారపడాలి? మన దేశంలోనే సరసమైన ధరలకు ప్రపంచ స్థాయి నూలును ఉత్పత్తి చేయాలని మేం నిర్ణయించుకున్నాం’ అంటున్నారు హీనా. 

శ్రమ ఎక్కువే!

ఆగస్టు 2022లో ప్రారంభించిన హాబీ స్టోర్‌లో వివిధ రకాల ప్రీమియం, నాణ్యత గల నూలును అందిస్తున్నాం. మా షాప్‌లోకి వచ్చే కస్టమర్లు నూలును కొనుగోలు చేయడంతోపాటు మంచి అనుభూతి చెందుతారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఫ్రాంచైజీ విధానంలో స్టోర్లు ప్రారంభించాం. చేతి వృత్తులకు శ్రమ ఎక్కువ కాబట్టి ధర కూడా ఎక్కువే. అయితే, చేతి వృత్తులవారికి శిక్షణ ఇవ్వడం పెద్ద సవాలుగా మారింది. ఈ పని చేయాలంటే చాలా ఓపిక, ఇష్టం ఉండాలి. ఒక విధంగా ఇది నా కలల ప్రాజెక్టు. 

మహిళలకు ఉపాధి

ప్రస్తుతం మ్యాజిక్ నీడిల్స్ కంపెనీలో 300 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరిలో 150 మంది ముంబై నుంచి, 50 మంది హిమాచల్‌ప్రదేశ్, మరో 50 మంది కోల్‌కతా వారు ఉన్నారు. మిగిలిన వారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో ఒక్కరోజులో 1,400 కంటే ఎక్కువ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

చాలామంది మహిళలు ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూనే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మ్యాజిక్ నీడిల్స్‌లో చేరడానికి ఆసక్తి ఉన్న మహిళలు స్థానిక కమ్యూనిటీ గ్రూపులు, ఎన్‌జీవోల సపోర్టుతో వస్తున్నారు. ఈ 300 మంది మహిళలకు 20 మంది అల్లికలకు సంబంధించిన మెలకువలను నేర్పిస్తారు.