calender_icon.png 24 October, 2024 | 5:56 AM

డార్లింగ్‌తో నా కల నెరవేరింది

12-07-2024 12:05:00 AM

చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. దర్శకుడిగానూ తెలుగులోనే సినిమాలు చేయాలనుకుంటున్నా అంటున్నారు అశ్విన్ రామ్. ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం ‘డార్లింగ్’ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్ రామ్ ‘డార్లింగ్’ సినిమా విశేషాలను పాత్రికేయులతో పంచుకున్నారిలా.. 

ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రియదర్శి నేను కలిశాం. తర్వాత మంచి స్నేహితులమయ్యా. ఆయన వలనే ఈ సినిమా చేయగలిగాను. ప్రియదర్శి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. పనిగట్టుకుని సినిమాల్లో సందేశం ఇవ్వాలని నేనుకోను. కథాంశాన్ని వినోదాత్మకంగా చెప్పడానికే ప్రాధాన్యతనిస్తాను. డార్లింగ్ ఆ కోవలోనిదే. ట్రైలర్‌లో హీరోయిన్‌కి స్ప్లిట్ పర్సనాలిటీ ఉండటం చూసి ‘అపరిచితుడు’ సినిమాతో పోలుస్తున్నారు. అయితే డార్లింగ్ కథ, నేపథ్యం వేరు. ఆ డిజార్డర్‌ని చూపించడం వల్ల సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.

నభా ఆ పాత్రని చాలా బాగా చేశారు. అనన్య నాగేళ్ల పాత్ర ఈ సినిమాలో కీలకమైనది. కథ పూర్తిగా విన్న తర్వాత ఆ పాత్రని చాలా ఇష్టపడి చేశారామె. -నిర్మాతలు కథని నమ్మి ఎక్కడా రాజీపడకుండా సినిమా చేసే అవకాశమిచ్చారు. వివేక్ సాగర్ సంగీతానికి నేను పెద్ద అభిమానిని. వివేక్ ఎక్కువ సినిమాలు చేయరు. అయితే కథ వినమని అడిగాను. అది ఆయనకి నచ్చడంతో ‘డార్లింగ్’ చేస్తానని చెప్పారు. ఈ సినిమాకి పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. భార్యాభర్తలు కూడా ప్రేమికులే కదా. అయితే పెళ్ళి తర్వాత వ్యవహారాలను మరోకోణంలో చూపించే కథ ఇది. తప్పకుండా అందరికి నచ్చుతుంది. -చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూసి పెరిగాను. తెలుగు సినిమాలపై నాది వన్ సైడ్ లవ్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో తెలుగులో చేయాలన్న కల తీరినందుకు చాలా ఆనందంగా ఉంది.