కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని దర్శకులు సుజీత్, సందీప్ కలిసి తెరకెక్కిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్రబృందంతో తన జర్నీ సాగిన తీరును ప్రొడ్యూసర్ గోపాలకష్ణరెడ్డి మంగళవారం మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. “కొత్తవాళ్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే సినిమాలు నిర్మిస్తున్నా. వ్యాపారాలు చేసుకుంటూనే సినిమాలూ చేస్తున్నా. హీరో కిరణ్‌పై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారానే ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది.
కిరణ్ కష్టపడే తత్వం ఉన్న హీరో. ఈ సినిమాకు మే నెలలో మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెడితే మళ్లీ ఉదయం దాకా డబుల్ కాల్ షీట్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 వరకు షూటింగ్ చేసినా మళ్లీ ఉదయం ఐదింటికే సెట్‌కు వచ్చేవాడు. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు.. కథను వాళ్లు మలుపు తిప్పిన విధానం చూసి వీళ్లు ఏదైనా చేయగలరనే నమ్మకం వచ్చింది.
కథ ఎంత బాగా చెప్పారో అంత కంటే బాగా తీశారు. చివరి నిమిషం వరకు టీమ్ అంతా ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. దాంతో నాకు టెన్షన్ తగ్గిపోయింది. టీజర్ రిలీజ్ అయిన వెంటనే బిజినెస్ కోసం కాల్స్ వచ్చాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 350 పైచిలుకు థియేటర్లలో ‘క’ రిలీజ్ అవుతోంది. తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంటే మిగతా భాషల్లో క్రేజ్ ఏర్పడుతుంది.