calender_icon.png 21 October, 2024 | 4:05 AM

దర్శకుల సంఘానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది

30-07-2024 12:05:00 AM

దర్శక సంజీవని కార్యక్రమంలో విజయ్ దేవరకొండ

“దర్శకులు కావాలనుకునే క్రమంలో మీ కష్టాలు ఎలా ఉంటాయో నేను హీరోగా ఎదగకముందు చూశాను” అని దర్శకులను ఉద్దేశించి అన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆదివారం దివంగత దాసరి నారాయణరావు పేరిట తెలుగు దర్శకుల సంఘం తమ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా కార్డులను అందించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఉపాధ్యక్షుడు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, పరిశ్రమ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “కలను సాకారం చేసుకునే క్రమంలో స్థిరమైన ఆదాయం.. భవిష్యత్ మీద భరోసా ఉండవు.

అయినా ముందుకు సాగుతుంటారు. దీని గురించి అసోసియేషన్ సభ్యులు నన్ను  కలిసినప్పుడు ఏదో మంచి చేయాలనే తపన వారిలో కనిపించింది. ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ సంఘానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది” అన్నారు. గతంలో సభ్యుల అవసరాలకు కొంతమేర ఆర్థిక సాయం చేశామన్న సంఘం అధ్యక్షుడు వీరశంకర్, సాయి రాజేశ్ ఆలోచనతో అందిస్తున్న ఈ హెల్త్ కార్డుల ద్వారా సంఘంలోని 720 మంది లబ్దిదారులకు మేలు జరుగనుందని తెలిపారు. ఈ సందర్భంగా దర్శక సంజీవని కోసం సాయమందించిన వారందిరికీ సాయి రాజేశ్ ధన్యవాదాలు తెలిపారు.