calender_icon.png 28 October, 2024 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కక్షతోనే నా బిడ్డను జైల్ల పెట్టిర్రు..

24-07-2024 12:58:03 AM

  1. బిడ్డ జైలుకు పోతే తండ్రికి బాధ ఉండదా..?
  2. పార్టీ మారినోళ్ల గురించి రంది లేదు
  3. మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): రాజకీయ కక్షతోనే తన కూతురు కవితను జైల్లో పెట్టారని, కూతురు జైల్లో ఉంటే తండ్రిగా తనకు బాధ ఉండదా అని బీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు. తాను అగ్ని పర్వతంలా ఉన్నానని, తమ పార్టీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు లేవన్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులు కూడా తాను ఎదుర్కొన్నట్లు తెలిపారు. చాలా కష్టమైన సందర్భంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. వైఎస్ హయాం లో పది మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నా అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు చెప్పారు.

ఎన్నికల వరకు నలుగురు ఎమ్మెల్యేలతో ఉన్న కాంగ్రెస్  రాష్ట్రం లో అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేక పోయిందని ఆపార్టీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా బీఆర్‌ఎస్‌ను అప్రతిష్ట పాలు చేసే విధంగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పుతున్నా యని, రాజకీయాలు అంటే తెలియని నాయకులను తీసుకొచ్చి పెద్ద పెద్ద పదవులు ఇస్తే కష్ట కాలంలో పార్టీని వీడుతున్నారని వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. 

సభలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యుహాలను వారికి వివరించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా అసెంబ్లీలో వ్యవహరించాలని సూచించారు. నిరుద్యోగుల సమస్యలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కాళేశ్వరం ప్రాజెక్టుపై సర్కార్‌ను నిలదీయాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఈనెల 25, 26 తేదీల్లో కాళేశ్వరం పర్యటన చేసి మేడిగడ్డ, కన్నెపల్లి పంపుహౌస్‌లను సందర్శించాలని ఆదేశించారు. ఈసందర్భంగా శాసనమండలి బీఆర్‌ఎస్ పక్షనేతగా మధుసూదన చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.