ఎంపీ ఈటెల రాజేందర్...
మేడ్చల్ (విజయక్రాంతి): మల్కాజిగిరిని నిరుద్యోగ రహిత పార్లమెంట్ నియోజకవర్గంగా మార్చడమే తన లక్ష్యమని ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender) అన్నారు. శుక్రవారం పూడూరులోని తన నివాసంలో నిపుణ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఎంప్లాయిమెంట్ సెల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారని, కానీ అందరికీ ఉద్యోగాలు రావడం లేదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్ లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. తాను నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు హుజురాబాద్, గజ్వేల్ లో కూడా యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు.
ప్రతినెల 1000కి తగ్గకుండా ఉద్యోగాలు కల్పిస్తానని స్పష్టం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేక కంపెనీలు ఉన్నాయని, వాటిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికంగానే కాకుండా విదేశాల్లో కూడా నర్సులు, ఇతర టెక్నికల్ ఉద్యోగాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 9 నియోజకవర్గాలలో నిరుద్యోగ సర్వే మొదలైందని, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో సర్వే చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగ రహిత మల్కాజ్గిరి పోస్టర్ ను ఆవిష్కరించారు.