calender_icon.png 21 October, 2024 | 12:50 AM

ఏడేళ్ల క్రితమే ఉదయ్‌తో ఎంవోయూ!

28-07-2024 05:51:08 AM

  1. 2017 జనవరి 2 సర్టిఫికెట్ జారీ.. సంతకాలు చేసిన అధికారులు 
  2. రూ. 8,923 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని ఒప్పందం 
  3. రెండు డిస్కంలు విద్యుత్తు పంపిణీ నష్టాలను తగ్గించుకునేలా ఒప్పందం 
  4. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు!

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): అప్పుల్లో కూరుకుపోతున్న డిస్కంలకు చేయూతనందివ్వడంతోపాటు విద్యుత్తు నష్టాలను తగ్గించుకోవడం, అలాగే స్మార్ట్ మీటర్లను బిగించేందుకు అంగీకరిస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్దేశించిన ‘ఉదయ్’ పథకంలో తెలంగాణ రాష్ట్ర, రాష్ట్రంలోని రెండు డిస్కంలు ఎంవోయూ (అవగాహనా ఒప్పందం) కుదుర్చుకున్నాయి. 2017 జనవరి 2 తారీఖున కేంద్ర ఇంధన శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెండు డిస్కంలు (ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్) కలిసి కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి సర్టిఫికెట్ కూడా జారీ అయ్యింది. శనివారం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతల నుంచి వచ్చిన ఆరోపణలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెబుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ఒప్పందాలను అమలుచేయకపోతే అగ్రిమెంట్ ఉల్లంఘించినందుకు కేంద్రం చర్యలు తీసుకునే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్తు సంస్థల మెడపై కత్తి వేలాడుతున్నదని సీఎం పేర్కొన్నారు.

త్రైపాక్షిక ఒప్పందం

కేంద్రం (ఇంధన శాఖ), తెలంగాణ ప్రభుత్వం, రెండు డిస్కంలు కలిసి త్రైపాక్షిక ఎంవోయూ (అవగాహనా ఒప్పందం)ను 2017 జనవరి 2న కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 2015 సెప్టెంబర్ 30 నాటికి రెండు డిస్కం (ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్)లకు ఉన్న మొత్తం అప్పుల్లో 75 శాతం తెలంగాణ ప్రభుత్వం 2017 మార్చి చివరి నాటికి టేకోవర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం అప్పుల్లో 75 శాతం అంటే రూ. 8,923 కోట్లను తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేయాలి. ఇందులో 50 శాతం అంటే రూ. 4,462 కోట్లను డిస్కంలకు గ్రాంట్ల రూపంలో 2016 అందివ్వాలి. మరో 25 శాతం రూ. 2230 కోట్లు డిస్కంలకు రుణం రూపంలో బదిలీ చేయాలి.  25 శాతం అంటే రూ. 2,231 కోట్లను డిస్కంలకు ఇక్విటీ రూపంలో బదిలీ చేయాలి.

మొత్తంలో  అప్పుల్లో మిగిలిన 25 శాతం అంటే.. రూ. 2,230 కోట్లు రాష్ట్ర రుణంగా డిస్కంలకు అందించాలని ఈ ఎంవోయూలో పొందుపర్చారు. ఇందుకు గాను డిస్కంలు తమ విద్యుత్తు పంపిణీ నష్టాలను నిర్దేశించినమేరకు తగ్గించుకోవాలి. 2016 నాటికి ఎస్‌పీడీసీఎల్ 12.68 శాతానికి, ఎన్‌పీడీసీఎల్ 11.90 శాతానికి ఏటీ అండ్ సీ నష్టాలను తగ్గించుకోవాలి. అలాగే 2018 నాటికి ఎస్‌పీడీసీఎల్ 9.90 శాతానికి, ఎన్‌పీడీసీఎల్ 10.00 శాతానికి నష్టాలను తగ్గించుకోవాలి. అలాగే 2017 జూన్ 30 నాటికి డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్లను అమర్చాల్సి ఉంటుంది. అలాగే వ్యవసాయం కనెక్షన్లు మినహా 500 యూనిట్లకు ఎగువన ఉండే వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లను డిసెంబరు 2018 చివరినాటికి అమర్చాలి.

ఉన్నతాధికారుల సంతకాలు

కేంద్ర ఇంధనశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెండు డిస్కంల మధ్యన కుదిరిన ఈ ఎంవోయూపై ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఈ త్రైపాక్షిక ఒప్పందంపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రెటరీ డాక్టర్ ఏకే వర్మతోపాటు తెలంగాణ ప్రభుత్వం తరఫున అప్పటి ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాలరావులు సంతకాలు చేశారు. అలాగే డిస్కంలకు ఉన్న మొత్తం అప్పుల్లో 75 శాతం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏయే బ్యాంకులు, రుణ సంస్థల అప్పులను టేకోవర్ చేసుకోవాలనేది కూడా ఈ ఒప్పందంలో పొం దుపర్చారు. దీనితోపాటు డిస్కంలు బాధ్యత తీసుకోవాల్సిన 25 శాతం అప్పుల జాబితాను పేర్కొన్నారు. అలాగే రెండు డిస్కంల పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, సంస్థల నుంచి 2016 సెప్టెంబర్ 30 నాటికా రావాల్సిన విద్యుతు బకాయిలు రూ. 2,416.22 కోట్ల వివరాలనుకూడా ఇందులో పొందుపర్చారు. డిస్కంల ఆదాయ, వ్యయాలు, ఇతర ఆర్థికపరమైన అంశాలనుకూడి ఈ త్రైపాక్షిక ఒప్పందంలో క్షుణ్ణంగా పేర్కొనడం గమనార్హం.