హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాం తి): మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ( కాంగ్రెస్, శివసేన-ఉద్దవ్‌ఠాక్రే, ఎన్‌సీపీ- శరద్‌పవార్ కూటమి)దే విజయమని, 200కు పైగా సీట్లలో గెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని జాల్నా, పులంబ్రి నియోజక వర్గాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ ఎజెండా అని మండిపడ్డారు. మహారాష్ట్రలోనూ అదే జరిగిందని, ప్రభుత్వాలను కూల్చినందుకు బీజేపీ ఆ ప్రతిఫలం అనుభవించబోతుందని హెచ్చరించారు.
కుల గణనపై ప్రధానిమోడీ ఎందుకు నోరు మెదపడం లేదని, దేశవ్యాప్తంగా కుల గణనకు మద్దతు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటనీ ప్రశ్నించారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ఇచ్చిన హామీలను అమలు చేశామని, మహారాష్ట్ర ప్రజల కోసం రాహుల్ గాంధీ ఐదు హామీలు ఇచ్చారని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామని వివరించారు.