calender_icon.png 26 December, 2024 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్యాలమ్మ నిందితుడికి రిమాండ్

03-11-2024 01:31:17 AM

చర్లపల్లి జైలుకు తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడు సల్మాన్ సలీం ఠాకూర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఏసీపీ జె.విజయసారథి తెలిపారు.

కాగా, మహారాష్ట్రకు చెందిన సల్మాన్ సలీం ఠాకూర్.. మునావర్ జామా అనే మోటివేషనల్ స్పీకర్ గత నెలలో నగరంలో నిర్వహించిన క్లాసులకు అటెండ్ అయ్యేందుకు వచ్చి సికింద్రాబాద్‌లోని మెట్రో పొలీస్ హోటల్‌లో దిగాడు. ఈ క్రమంలో గతనెల 14న తెల్లవారుజామున సుమారు 4:31 గంటల ప్రాంతంలో సలీం ఠాకూర్.. కుమ్మరిగూడలోని ఆలయంలోనికి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.

గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడిన సలీంను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.  ఇటీవల అతడు కోలుకోగా నవంబర్ 1న అరెస్టు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసును సీసీఎస్, డీడీ డీసీపీ శ్వేత నేతృత్వంలో సీసీఎస్, సిట్ ఏసీపీ జె.విజయసారథి దర్యాప్తు చేస్తున్నారు. 

గతంలోనూ పలు కేసుల్లో..

నిందితుడు ముంబైకి చెందిన సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ బీఈ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో జకీర్ నాయక్ తదితర ఇస్లామిక్ మతబోధకుల వీడియోలు చూస్తూ హిందూ మతంపై ధ్వేషం పెంచుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో నిందితుడు గతంలో ముంబైలోని అరేసబ్ పీఎస్ పరిధిలో పాదరక్షలతో గణేశ్ మండపంలోకి ప్రవేశించి విగ్రహారాధనను అపహాస్యం చేస్తూ స్థానిక వ్యక్తులతో విభేదించాడు. గత ఆగస్టులో మీరారోడ్ పీఎస్ పరిధిలోని మనోకమన సిద్ధిమహాదేవ మందిరంలోకి చొరబడి.. తన పాదంతో విగ్రహాన్ని తాకాడు. ఆయా సంఘటనల్లో స్థానికుల ఫిర్యాదు మేరకు సల్మాన్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు.