calender_icon.png 21 September, 2024 | 5:35 AM

త్రిపురలో తిరుగుబాటుకు స్వస్తి

06-09-2024 12:08:34 AM

  1. 35 ఏళ్ల సాయుధ పోరాటానికి ముగింపు పలికిన ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ, ఏటీటీఎఫ్ గ్రూపులు 
  2. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శాంతి ఒప్పందం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఈశాన్య రాష్ట్రం త్రిపురకు దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా తలనొప్పిగా మారిన ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ)’, ‘ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్(ఏటీటీఎఫ్)’ గ్రూపుల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ ఈ రెండు గ్రూపులు బుధవారం దేశ రాజధాని సాక్షిగా కేంద్ర హోంమత్రి అమిత్‌షా, త్రిపుర సీఎం మాణిక్ సాహా సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి.

ఈ శాంతి ఒప్పందంపై అమిత్ షా మాట్లాడుతూ.. ‘ ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు.. గత 35 ఏళ్ల పోరాటానికి స్వస్తి పలుకుతూ రెండు రెబల్ గ్రూపులు శాంతి మార్గంలోకి వస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ ఒప్పందం ద్వారా దాదాపు 10వేల మంది ఆయుధాలు విడిచి జన జీవన స్రవంతిలోకి రావడం ఆనందంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, అక్కడ శాంతిని నెలకొల్పడానికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉంది’ అని తెలిపారు.

అలాగే త్రిపుర సీఎం సాహా మాట్లాడుతూ.. ‘రెండు రెబల్ గ్రూపులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం చారిత్రక ఘట్టం. ఈ క్షణాన్ని చూసినందుకు ఆనందంగా ఉంది. వారి సంక్షేమం కోసం దాదాపు రూ.250 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి, శాంతి ఒప్పందం జరగడంలో కీలక పాత్ర పోషించిన అమిత్‌షాకు త్రిపుర ప్రజల తరఫున  ధన్యవాదాలు’ అని అన్నారు.

తిరుగుబాటు గ్రూపుల నేపథ్యం..

1989లో బెంగాలీల వలసలు పెరగడంతో బాప్టిస్ట్ చర్చి ఆఫ్ త్రిపుర మద్దతుతో ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ ఆవిర్భవించింది. స్వతంత్ర త్రిపుర రాష్ట్రాన్ని స్థాపించాలని కోరుతూ ఈ సంస్థ ఆవిర్భవించింది. త్రిపురలో వలసలను ఖండిస్తూ అనేక దాడులకు తెగబడింది. మరో రెబల్ గ్రూప్.. ఏటీటీఎఫ్ త్రిపుర రాష్ట్రంలో క్రియాశీలంగా ఉన్న జాతీయవాద తీవ్రవాద సమూహం. ఇది 1990లో రంజిత్ దెబ్బర్మ నాయకత్వంలో స్థాపించారు. ఈ రెండింటిని గతంలో ఉగ్రవాద సంస్థలుగా గుర్తించారు.