- ఏఆర్ సిబ్బందికి వార్షిక మొబిలైజేషన్ శిక్షణ
- ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి
మెదక్, జనవరి 17(విజయక్రాంతి): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా సాయుధ దళాల వార్షిక పునరుశ్చరణ (మోబిలైజేషన్) శిక్షణలో భాగంగా జిల్లా అదనపు ఎస్.పి మహేందర్ ఆధ్వర్యంలో ఏఆర్ డి.ఎస్.పి రంగ నాయక్, అడ్మిన్ ఆర్.ఐ శైలెంధర్ శిక్షణలో సాయుధ దళ సిబ్బంది, అధికారులకు సాయుధ దళాల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.
ఇందులో భాగంగా సిబ్బందికి ప్రతి రోజు ఉదయం ఫిజికల్ ట్రైనింగ్, పెరేడ్, మాబ్ ఆపరేషన్, ఆయుధాల శిక్షణ, నాకబంది, విఐపి, వివిఐపి, సెక్యూరిటీ, ఇతర అంశాలపై శిక్షణ క్లాసులు ఆర్.ఐలు, అడ్మిన్ ఆర్.ఐ శైలెంధర్, ఆర్‌ఎస్‌ఐలు నరేశ్, భవానీ కుమార్, మహిపాల్, సుభాష్, యశ్వంత్ శిక్షణ ఇస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏఆర్ సిబ్బంది ఒక్క ఏఆర్ డ్యూటీనే కాకుండా సివిల్ పోలీసులతో సంయుక్తంగా లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఏఆర్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు, వారిని కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సమాయత్తం చేసేందుకు ఆన్యువల్ మొబిలైజేషన్ లో భాగంగా దోహద పడుతుందన్నారు.
పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ, శారీరక దారుఢ్యం సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, సమయం దొరికినప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రతిరోజు వ్యాయామం చేసుకోవాలని, పోలీసులు ఆరోగ్య పరంగా దృఢంగా ఉన్నప్పుడే బాగా పని చేయగలుగుతారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.