కొత్త ఉద్యోగులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశం
వర్షాలతో10 శాతం ఉత్పత్తిని నష్టపోయాం
యువ కార్మికుల గైర్హాజరుపై సీఎండీ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పని సంస్కృతిని మెరుగుపర్చేందుకు వీలుగా నూతన ఉద్యోగులందరూ విధిగా ఐదేండ్లపాటు భూగర్భ గనుల్లో (యూజీ) పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన ఉజ్వల సింగరేణి పాతర అవగాహన సదస్సుల్లోనూ పలువురు సీనియర్ కార్మికులు కూడా ఈ విషయంపై అభిప్రాయాలు పంచుకున్నారని సీఎండీ పేర్కొన్నారు.
మంగళవారం సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపు తదితర అంశాలను సమీక్షించారు. ఇప్పటికే వర్షాలు తదితర కారణాలతో ఉత్పత్తి లక్ష్య సాధనలో 10 శాతం వెనుకబడి ఉన్నామని, దీనిని పూడ్చుకోవడానికి నెలవారీ లక్ష్యాలను కూడా సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
దీనికోసం గనులవారీగా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని సూచించారు. ఉత్పత్తి, లక్ష్యాల సాధనలో ప్రతి ఉద్యోగి, అధికారి పాత్ర చాలా కీలకమన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోజుకు 2.4 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగాలి..
ఈ ఏడాది నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందన్నారు. దీనిని అధిగమించేందుకు ఇకపై రోజుకు 2.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగాలని నిర్దేశించారు. రానున్న 165 రోజులు ఉత్పత్తి లక్ష్య సాధనకు ఎంతో కీలకమన్నారు. రోజుకు 17.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించేలా చూడాలన్నారు.
ప్రతిరోజూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాల్సిన తరుణంలో యువ కార్మికులు విధులకు గైర్హాజరు అవుతుండటం, సమయ పాలన పాటించకపోవడంపై సీఎండీ బలరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎందరో ఎదురుచూస్తున్నారని, కానీ సింగరేణిలో ఉద్యోగం లభించినా డ్యూటీ సరిగ్గా చేయకపోవడంం అత్యంత బాధాకరమని అన్నారు.
ఈ నేపథ్యంలో చాలాకాలంగా విధులకు రానివారిని విధుల నుంచి తొలగించడానికి వెనుకాడమని హెచ్చరించారు. గైర్హాజరీ వల్ల ఇతర ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, దీనితోపాటు ఉత్పత్తి లక్ష్యంపైకూడా ప్రభావం చూపుతుందని సీఎండీ పేర్కొన్నారు. సమీక్షలో డైరెక్టర్లు సత్యనారాయణరావు, వెంకటేశ్వరరెడ్డి, జీఎంలు ఎస్‌డీఎం సుభానీ, రవి ప్రసాద్, ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.