సీఎస్ శాంతికుమారి
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్‌లో నిర్వహించే రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పాల్గొననున్న సభా ఏర్పాట్లపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, అడిషినల్ డీజీ మహేశ్ భగవత్, సమాచారశాఖ కమిషనర్ హరీశ్, మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి తదితర అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షిం చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేడుకల్లో దాదాపు 150 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సభావేదిక వద్దకు చేరుకునే నాలుగు మార్గాల సమీపంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం సాయంత్రంలోగా ఏర్పాట్లన్నీ పూర్తి కావాలన్నారు. సభకు వచ్చే ప్రతి బస్సుకు ఒక కానిస్టేబుల్, ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. రైతులకు సీటింగ్, మంచినీటి సౌకర్యం, మెడికల్ క్యాంపులు, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సభకు కనీసం 25వేలకు పైగా మహిళా రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.