ఢిల్లీ x లక్నో
ఢిల్లీ: ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన తరుణంలో లక్నో సూపర్ జెయింట్స్ కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో అమీతుమీ తేల్చుకోనుంది. ఒక రకంగా లక్నోకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన లక్నో 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఢిల్లీతో మ్యాచ్‌లో గెలిస్తే పట్టికలో 5వ స్థానానికి చేరడంతో పాటు ప్లేఆఫ్ ఆశలు కూడా సజీవంగా ఉంచుకునే అవకాశముంది. హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం వారం రోజులు విరామం రావడంతో రాహుల్ సేన ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం. మరోవైపు సీజన్‌లో ఢిల్లీకిదే చివరి మ్యాచ్. 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోపై గెలిచినప్పటికీ 14 పాయింట్లతో సీజన్‌ను ముగించే చాన్స్ ఉంది. ఇక ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే గత మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న కెప్టెన్ పంత్ దూరమవ్వడం జట్టును దెబ్బతీసింది.
ఓపెనర్ మెక్‌గుర్క్ భీకరమైన ఫామ్ కనబరుస్తున్నాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బ్యాటుతో, బంతితో స్థిరంగా రాణిస్తున్నాడు. మిగతావారు మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మలు మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. లక్నో బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ స్థిరంగా ఆడుతున్నప్పటికి మరో ఓపెనర్ డికాక్ ఫామ్ కలవరపెడుతోంది. మిడిలార్డర్‌లో స్టోయినిస్, ఆయుష్ బదోనీ రాణిస్తున్నారు. ఇక ఫినిషర్‌గా పూరన్ తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్, మోసిన్ ఖాన్‌లతో పర్వాలేదనిపిస్తోంది. సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో ఢిల్లీ విజయం సాధించింది.
రాహుల్ కెప్టెన్‌గా కొనసాగేనా?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆ జట్టు యాజమాని సంజీవ్ గొయెంకా సీరియస్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం గొయెంకా.. రాహుల్‌ను మైదానంలో చివాట్లు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అంతర్జాతీయ క్రికెటర్, అనుభవజ్ఞుడైన రాహుల్‌పై ఇలా అసహనం వ్యక్తం చేయడం సబబు కాదని పలువురు క్రికెటర్లు సహా మాజీలు పేర్కొన్నారు. వచ్చే సీజన్‌లో కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ వదులుకోనుందంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సీజన్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు రాహుల్ కెప్టెన్‌గా తప్పుకుంటాడని.. అతని స్థానంలో కృనాల్ జట్టును నడిపించే అవకాశముందని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై రాహుల్, గొయెంకాలు స్పందించలేదు. దీంతో మంగళవారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడా అనేది ఆసక్తికరం. ఐపీఎల్ 17వ సీజన్‌లో రాహుల్ స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ అతని స్ట్రుక్‌రేట్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.
టీ కప్పులో తుఫాను
‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా.. కేఎల్ రాహుల్ గొయెంకా వివాదంపై లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ నిధానంగా స్పందించింది. సారథి రాహుల్, జట్టు యజమాని సంజీవ్ మధ్య వివాదంపై ఆ జట్టు సహాయక కోచ్ లాన్స్ క్లూసెనర్ స్పందించాడు. వారి మధ్య వివాదం టీ కప్పులో తుఫాను లాంటిదని పేర్కొన్నాడు. ‘వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగలేదనిపిస్తోంది. కేవలం రాహుల్ బ్యాటింగ్ విషయమై గొయెంకా కాస్త సీరియస్‌గా మాట్లాడారు. అంతే తప్ప రాహుల్‌కు చివాట్లు పెట్టినట్లు నాకు ఎక్కడా కనిపించలేదు.
ఆ విషయం ఆరోజే సమసిపోయింది. అదేమంత పెద్ద విషయం కాదు. ఇక కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శనతో నాణ్యమైన ప్లేయర్‌గా ఎదిగిన రాహుల్‌కు ఐపీఎల్ కఠినంగా అనిపిస్తోంది. అతడి స్ట్రయిక్‌రేట్ ఐపీఎల్‌కు సరిపోదు కానీ ఒక మంచి ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పగలడు’ అని క్లూసెనర్ చెప్పుకొచ్చాడు.