13-02-2025 01:57:44 AM
పీవోల శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్
కరీంనగర్, ఫిబ్రవరి12(విజయక్రాంతి): ఎలక్షన్ కమిషన్ నియమావళికి అనుగుణంగా ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అన్నారు. ఎమ్మె ల్సీ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది.
పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులు నిర్వహించాల ని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన కరదీపిక లోని మార్గదర్శకాలు పాటించాలని అన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు.
ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ తేదీన నిర్ణీత ఫారాలను పొరపాటు లేకుండా పూరించాలని, ఫారం 16, పిఓ డైరీ ని జాగ్రత్తగా నింపాలని సూచించారు. ఓటర్ వివరాలను పరిశీలించి గుర్తింపు కార్డుతో సరి చూసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలపై ప్రతి ప్రిసైడింగ్ అధికారికీ పూర్తి అవగాహన ఉండాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్స్ సీల్ విధానం డెమోను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి పవన్ కుమార్, డి ఆర్ డి ఓ శ్రీధర్, మాస్టర్ ట్రైనర్లు అమరేందర్ రెడ్డి, సంపత్, రజనీష్ పాల్గొన్నారు.