calender_icon.png 27 October, 2024 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీనం తప్పదా!

12-08-2024 01:04:43 AM

బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై విస్తృత చర్చ

కారు చేజారిన మైనారిటీ ఓటు బ్యాంకు

చేరితే నష్టమేంటి అంటున్న గులాబీ నేతలు

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో పదేండ్లు తిరుగు లేని అధికారం చెలాయించి ఒక్కసారిగా చతికిలపడిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఇప్పుడు మనుగడ కోసం కష్టాలు పడుతున్నది. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కట్టడం, ఒక్క ఎంపీని గెలిపించుకోలేని దైన్యంలోకి పార్టీ జారిపోవటంతో.. తెలంగాణలో ఇక బీఆర్‌ఎస్ పని అయిపోయిందనే చర్చ నడుస్తున్నది. దీంతో బీఆర్‌ఎస్‌ను త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం ఊపందుకొన్నది.

బీఆర్‌ఎస్‌లో కూడా అంతర్మథనం మొదలైన ట్టు కనిపిస్తున్నది. బీజేపీలో చేరితే తప్ప రాజకీయంగా మనుగడ లేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇన్నాళ్లు పార్టీకి దన్నుగా ఉన్న మైనారిటీ ఓటుబ్యాంకు కూడా గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లిపోయింది. మైనారిటీలకు కోపం తెప్పించకుండా ఉండేందుకు బీజేపీకి బీఆర్‌ఎస్ ఇన్నాళ్లు దూరంగా ఉంటూ వస్తున్నది. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకే దూరం కావటంతో లౌకికవాదం పేరు తో ఆగిపోవడం సరికాదని గులాబీ నేతలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిల పడింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బీఆర్‌ఎస్ పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరో 16 మంది త్వరలోనే హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతున్నది.

అదే జరిగితే పార్టీ ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకొని బీఆర్‌ఎస్ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ తరుణంలోనే బీఆర్‌ఎస్ అలర్ట్ అయ్యిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేలను కోల్పోవడంకన్నా పార్టీని బీజేపీలో విలీనం చేయడం ద్వారానే బలపడవచ్చనే అభిప్రాయంలో పార్టీ ప్రధాన నేతలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరడం వల్ల రాజకీయంగానూ భవిష్యత్తు బాగుంటుందని ఆ పార్టీలో చర్చ జరగుతోందని అంటున్నారు.

కవితను బయటకు తీసుకువచ్చేందుకు సైతం

ఢిల్లీ మద్యం ముడుపుల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యి ఆదివారానికి 150 రోజులు గడిచాయి. ఒక మహిళను 150 రోజులకుపైగా జైలులోనే ఉంచడం చర్చనీయాంశమైంది. రాజకీయ విబేధాల కారణంగానే కవితను బీజేపీ పనిగట్టుకుని అరెస్టు చేయించిందని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కవితను అరెస్టు చేసినందుకే రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ సీట్లు సాధించిందనే చర్చ సైతం నడిచింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ప్రచారం వల్ల బీజేపీ దెబ్బతిన్నదని తెలంగాణ కమలనాథులు భావిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసి ఉంటే బీజేపీకి కలిసివచ్చేదని ఆ పార్టీ నేతల విశ్లేషణ. ఏది ఏమైనా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు మాత్రం ప్రస్తుతం తన కూతురు కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడమే ప్రధానమని భావిస్తున్నారు. అందుకోసం బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు కూడా సిద్ధమనే సంకేతాలిచ్చినట్టు సమాచారం.  

బీజేపీ ఓటు బ్యాంకుకు బీఆర్‌ఎస్ జత కలిస్తే

2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి 37.35 శాతం, కాంగ్రెస్‌కు 39.47 శాతం, బీజేపీకి 13.89 శాతం ఓట్లు వచ్చాయి. 2 శాతం ఓట్ల తేడాతో కారు పార్టీ అధికారానికి దూరమైంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కమలం పార్టీ ఏకంగా 35 శాతం ఓటింగ్‌తో సత్తా చాటింది. బీఆర్‌ఎస్ 16.6 శాతం ఓట్లకే పరిమితమైంది. 20.75 శాతం ఓట్లు కోల్పోయింది. అదే సమయంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 21.11 శాతం ఓట్లను పెంచుకుంది. ఆ ఓట్లన్నీ బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం తప్పదని జోరుగా చర్చ జరుగుతున్నా ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు పెద్దగా ఖండించనూ లేదు.

బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం బీఆర్‌ఎస్‌ను తాము విలీనం చేసుకోబోమని స్పష్టం చేశారు. అయితే బీజేపీలో నిర్ణయాలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి స్థాయిలో కాకుండా ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా స్థాయిలో జరుగుతాయి. జాతీయ నాయకత్వం విలీనం చేసుకునేందుకు సిద్ధమైతే రాష్ట్ర నేతలు అడ్డుకునే పరిస్థితి ఉండదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు నేరుగా ఢిల్లీ బీజేపీతో టచ్‌లో ఉండి ఈ అంశంపై చర్చిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయంలో బయటికి ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా, నిప్పులేనిదే పొగరాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.