19-04-2025 12:26:33 AM
భూ భారతి చట్టం అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో, మోపాల్ మండల కేంద్రంలో గల రైతు వేదికలలో వేర్వేరుగా నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టం ద్వారా రైతులకు.చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరించారు.
భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందిం చిన భూ భారతి (ఆర్ ఓ ఆర్) చట్టం - 2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని, సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు.
భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలం లోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు.
ఈ సదస్సులలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఐడిసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, నిజామాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.