calender_icon.png 22 December, 2024 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెళ్లాల్సిందే!

16-10-2024 03:21:34 AM

ఐఏఎస్‌లకు ఎదురుదెబ్బ

  1. తెలంగాణ, ఏపీ ఐఏఎస్ అధికారుల విభజన వ్యవహారంలో క్యాట్ స్పష్టం
  2. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరణ
  3. ఏకసభ్య కమిటీ నివేదిక ఇవ్వాలని కేంద్రానికి ఆదేశం
  4. విచారణ నవంబర్ 5కు వాయిదా
  5. హైకోర్టును ఆశ్రయించనున్న ఐఏఎస్‌లు

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ఏపీ, తెలంగాణలకు ఐఏఎస్ అధికారుల విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) నిరాకరిం చింది.

తెలంగాణలో పనిచేసే నలుగురు ఐఏఎస్‌లు, ఏపీలో పనిచేసే ముగ్గురు ఐఏఎస్ అధికారులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై క్యాట్ మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం ఈ నెల 9న జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఆలిండియా సర్వీసు అధికారులు (ఐఏఎస్)  వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16లోగా చేరాల్సిందేనని తేల్చిచెప్పింది.

కేంద్ర ఉత్తర్వులపై స్టే జారీకి నిరాకరించడంతో ఐఏఎస్ అధికారులకు ఎదురు దెబ్బ తగిలినట్టయ్యింది. ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆయా అధికారుల సేవల అవసరాలను పరిశీలించే తామీ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టంచేసింది.

కాగా, కేంద్ర ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల్లో విధుల్లో చేరినప్పటికీ ఈ చేరికలు తాము వెలువరించే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని షరతు విధించింది. నవంబరు 5లోగా వన్ మెన్ కమిటీ (ఏకసభ్య కమిటీ) ఇచ్చిన నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విచారణను నవంబరు 5కు వాయిదా వేసింది. 

సర్దుబాటు తప్పదు

గతంలో చేసిన కేటాయింపులనే ఖరారు చేస్తూ ఈ నెల 8న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణలో పనిచేసే ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కే ఆమ్రపాలి, ఏ వాణిప్రసాద్, డీ రొనాల్డ్‌రోస్, జీ సృజన, హరికిరణ్, శివశంకర్ మరోసారి క్యాట్‌ను ఆశ్రయించారు. వీరి పిటిషన్లను క్యాట్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, శాలిని మిశ్రా తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలు జరిగా యి. అనంతరం కేంద్రం జారీచేసిన ఆదేశాల నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆలిండియా సర్వీసు ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించిందని గుర్తు చేసింది. మార్గదర్శకాలు కొంతమందికి ఇబ్బంది కలిగించి ఉండవచ్చని, అంతమాత్రాన అధికారుల సర్దుబాటు తప్పదని స్పష్టం చేసింది.

అధికారుల అభ్యర్థనలను పరిశీలించి ఏకసభ్య కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికను కేంద్రం తరఫు న్యాయవాదులు కూడా అందించలేకపోయారని పేర్కొంది. ప్రజాప్రయోజనాలు, అధికారుల సేవలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆదేశాల మేరకు కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరాల్సిందేనని స్పష్టం చేసింది. విధుల్లో చేరినప్పటికీ కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు వేయలేదు?

తొలుత పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కే లక్ష్మీనరసింహ, జీ విద్యాసాగర్, కేఆర్‌కేవీ ప్రసాద్, వీ మల్లిక్, వాసిరెడ్డి ప్రభునాథ్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకసభ్య కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని తప్పుపట్టారు.

ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు చెప్పలేదని, పైగా, ఆ కమిటీ నివేదికను పిటిషనర్లకు అందజేయాలని చెప్పారు. నివేదికను పిటిషనర్లకు ఇచ్చి ఉంటే దానిపై అభ్యంతరాలు చెప్పుకొనేందుకు వీలుండేదని చెప్పారు. అభ్యంతరాలు తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీచేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని చెప్పారు.

ఈ దశలో క్యాట్ కల్పించుకుని.. హైకోర్టు ఉత్తర్వులను ఆమలు చేయలేదన్నపుడు నేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని పిటిషనర్లను ప్రశ్నించింది. కమిటీ ఏర్పాటును, అది సమర్పించిన నివేదికను ఎందుకు సవాలు చేయలేదని నిలదీసింది.

ఆలిండియా సర్వీసు ఉద్యోగులు అవసరాలకు అనుగుణంగా దేశ సరిహద్దుల్లో అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడింది. విజయవాడలో వరదలతో జనం ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి క్లిష్ట సమయంలో అక్కడికి వెళ్లి పనిచేయాలి కదా అని వ్యాఖ్యానించింది. కేటాయింపుల్లో పారదర్శకత లేదని తెలుస్తోందని, కొందరిపట్ల సానుకూలంగా వ్యవహరించడంతోనే పదేళ్లుగా వివాదం కొనసాగతూనే ఉందని పేర్కొంది. 

ఇక్కడే విద్యాభ్యాసం.. ఇక్కడే నివాసం

హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఇక్కడే ఉంటుండగా తమను ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా చూపించారని ఏ వాణిప్రసాద్, వాకా టి కరుణ చెప్పారు. అదేవిధంగా పరస్పర బదిలీ పరిధి ప్రత్యూష్ సిన్హా కమి టీ మార్గదర్శకాలు కుదించిందని తప్పుపట్టారు. అదేవిధంగా హరికిరణ్ విషయంలో రిజర్వేషన్ విధానాన్ని తప్పుగా అన్వయిం చారని చెప్పారు.

సీనియారిటీకి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ కటాఫ్ తేదీని తప్పుగా అన్వయించడంతో నష్టపోయినట్టు రొనాల్డ్ రోస్ పేర్కొన్నారు. కేంద్రం తరపు న్యాయవాదులు రాధాకృష్ణ, రజిత, మల్లికార్జున్‌లు వాదనలు వినిపిస్తూ.. అందరి అభ్యర్థలను పరిగణన లోకి తీసుకునే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

అందరూ ఒకేచోట ఉండాలని భావిస్తున్నారని, ఒక చోట ఎక్కువగా ఉంటే మరో రాష్ట్రం పరిస్థితి ఏమిటనేది ఆలోచన చేయాల న్నారు. పిటిషన్లను కొట్టివేయాలని కోరా రు. తదుపరి విచారణ నవంబర్ 5కి వాయిదా పడింది. కాగా, ఈ తీర్పుపై ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించనున్నారు.