calender_icon.png 18 January, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ కోర్టులో తేల్చుకోవాలి

18-01-2025 01:02:57 AM

అప్పీల్ పిటిషన్‌నూ కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): స్థానిక బాగ్‌అంబర్‌పేట్‌లోని వివాదాస్పద బతుకమ్మకుంట భూమి తనదేనంటూ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 7న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. సివిల్ వివాదాలపై హైకోర్టు జోక్యం చేసుకోబోదని, సివిల్ కోర్టులే వాటిని పరిష్కరించాలని చెప్పింది.

రాజ్యాగంలోని అధికరణ 226 కింద హైకోర్టు జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని వెల్లడించింది. అంబర్‌పేట్ మండలం బాగ్‌అంబర్‌పేట్‌లోని సర్వే నెంబర్ 563/1లోని 7 ఎకరాల భూమిని రిజిస్టర్ కాని విక్రయ ఒప్పందం ద్వారా సయ్యద్ ఆజాం నుంచి కొనుగోలు చేశానని, ఈ భూమి విషయంలో అంబర్‌పేట్ తహసీల్దార్, జీహెచ్ ఎంసీ, హైడ్రా జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఎ సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

తమ భూమిలో చెరువు లేదని, నిర్మాణాలకు యోగ్యమైన మెట్టభూమి అని, అయితే ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇది చెరువుకు చెందిన భూమి అని అధికారులు చెబుతున్నారని పిటిషనర్ వాదన. దీనిపై ఈనెల 7 సింగిల్ జడ్జి.. భూమి హక్కులకు చెందిన పత్రాలుగానీ, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఉన్నట్లుగా చూపకుండా భూమిపై హక్కులు కోరడం చెల్లదని తీర్పు వెలువరించారు.

ఈ తీర్పును కొట్టేయాలంటూ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు, డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. సివిల్ వివాదంలో ఆస్తిపై హక్కుల అంశాన్ని తేల్చాల్సింది సివిల్ కోర్టని, హైకోర్టు కాదని చెప్పింది. సివిల్ కోర్టులో భూ హక్కులను తేల్చుకోవాలని పిటిషనర్‌ను సూచించింది.