13-03-2025 02:16:59 AM
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. అందుకోసం సభ్యులందరూ కచ్చితంగా సభకు రావాల్సిందనేని స్పష్టం చేశారు. అలాగే సమావేశాల్లో సభ్యులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో కూడా క్రియాశీలకంగా ఉండాలని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడిన వెంటనే అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలైనందున అత్యంత కీలకంగా తీసుకోవాలని పేర్కొన్నారు. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యాక్రమాలపై పూర్తిగా చర్చించేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు.
ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన చేస్తుంటే అధికార పక్షం నుంచి ప్రభుత్వ విప్‌లుగానీ, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం గొప్ప విషయం కాదనీ రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప విషయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేశారు.
మంత్రులు కూడా తప్పనిసరిగా సభలో ఉండాలని, మొక్కుబడిగా హాజరుకావడం మంచిది కాదని సీఎం పేర్కొన్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిపై సమీక్షిస్తానన్నారు.
మంత్రుల నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయనే భావన చాలా మందిలో ఉందని, అది అపోహ మాత్రమేనని సీఎం పేర్కొన్నారు. ఎమ్మెల్యేలందరికీ సమానంగా నిధులు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లందరూ అని విషయాలపై మాట్లాడాల్సిన అవసరం లేదని, ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అంశంపై మాట్లాడాలని సీఎం సూచించారు.
జానారెడ్డి తనయుడికి సీఎం క్లాస్..
సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరి యస్ అయినట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగానే హాల్ నుంచి బయటకు వెళ్లడాన్ని తప్పుబట్టారట. ‘నేను మాట్లాడుతుండగానే మీరు బ యటికి వెళ్లిపోతే ఎలా? క్రమ శిక్షణతో మెలిగితేనే భవిష్యత్తు ఉంటుందని’ అని సీఎం అన్నట్టు తెలిసింది.