29-04-2025 05:06:35 PM
జిల్లా అదనపు కలెక్టర్ దేవసహాయం..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులకు గ్రామ సభ నిర్వహణతో పాటు సమాచార హక్కు చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం, గ్రామ సభ నిర్మాణ సామర్థ్యంపై పంచాయతీ కార్యదర్శులకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గ్రామాలు అభివృద్ధి చెందించడంలో పంచాయతీ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషిస్తారని అందరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. జిల్లాలోని ప్రతి మండలం నుంచి ఇద్దరు చొప్పున పంచాయతీ కార్యదర్శులకు సమాచార హక్కు చట్టంపై, గ్రామ సభ నిర్వహణ సామర్థ్యంపై శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వాటిని సద్వినియోగపరుచుకోవాలనీ సూచించారు. గ్రామ అభివృద్ధి గ్రామసభపై ఆధారపడి ఉంటుందని గ్రామసభ నిర్మాణం, నిర్వహణపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ గ్రామసభలో భాగస్వాములు చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్మాణ సామర్థ్యంపై సంవత్సరం పొడుగునా అధికారులకు ప్రజాప్రతినిధులకు మహిళా సంఘాలకు సంబంధిత శాఖల అధికారులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారి రామ్మోహన్, రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ ఎస్. హనుమంతు, రిసోర్స్ పర్సన్స్ కృష్ణ కోటేశ్వరరావు నర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.