calender_icon.png 4 April, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలు బాగుపడతారు

04-04-2025 01:20:47 AM

  1. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
  2. వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్
  3. ఇప్పటికే బిల్లును ఆమోదించిన లోక్‌సభ
  4. పెద్దల సభలో కూడా వాడీవేడి చర్చ
  5. రాజీనామా చేసిన జేడీ(యూ) నేతలు
  6. యూటర్న్ తీసుకున్న నవీన్ పట్నాయక్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వక్ఫ్ సవరణ బిల్లు 2025 వల్ల పేద ముస్లింలు బాగుపడతారని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నా రు. ఈ బిల్లు గురించి గురువారం రాజ్యసభలో కూలంకుషంగా చర్చ జరిగింది. బుధవారం గంటల కొద్దీ చర్చించిన తర్వాత ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

గురువారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. పలువురు మాట్లాడారు. జేపీసీలో కేవలం బీజేపీ ఎంపీల అభిప్రాయాలే పరిగణలోకి తీసుకున్నారని, ప్రతిపక్ష ఎంపీలు ఏం చెప్పినా విస్మరించారని కాంగ్రెస్ ఎంపీ నసీర్ హుస్సేన్ ఆరోపించారు.

కాంగ్రెస్ తన హయాంలో ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిందని నడ్డా ఆరోపించారు. ముస్లింలను వేధించేందుకే బీజేపీ పార్టీ ఈ బిల్లు తీసుకొచ్చిందని ఖర్గే అనగా.. అమిత్ షా మధ్యలో కలుగజేసుకున్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా 37 మంది సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. 

పేద ముస్లింలు బాగుపడతారు

బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర మంత్రి రిజిజు మాట్లాడారు. ‘మనం కనుక వక్ఫ్ ఆస్తులను సక్రమంగా అభివృద్ధి చేస్తే కోట్ల మంది పేద ముస్లింలు బాగుపడతారు. కొత్త బిల్లుకు “ఉమీద్‌” అనే పేరును నిర్ణయించాం. సచార్ కమిటీ సిఫారసులు కూడా ఈ బిల్లులో పొందుపరిచాం. ఈ బిల్లుపై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేశాయి. జాతీయ ఆస్తులు  వక్ఫ్ ఆస్తులుగా అస్సలుకే ప్రకటించబడవు. ఇప్పటి వరకు కేరళకు చెందిన 600 క్రిస్టియన్ కుటుంబాల భూములను తనవని వక్ఫ్ బోర్డు ప్రకటించుకుంది.’ అని అన్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కాంగ్రెస్, ఇతర పార్టీల రాజ్యసభ సభ్యులను రిజిజు అభ్యర్థించారు.

ఇది విభజన రాజకీయం: ఖర్గే

రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించారు. ‘ఈ బిల్లు విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. మైనార్టీల ను హింసిస్తుంది. 1995 చట్టానికి దీనికీ పెద్దగా తేడా లేదు. ప్రజల హక్కులను హరించేందుకు కొన్ని కొత్త క్లాజులు తెచ్చారు.’ అని విమర్శించా రు. ముస్లింలను వేధించేందుకే ఈ బిల్లు తెచ్చారని ఖర్గే అనగా.. కేంద్ర మంత్రి అమిత్ షా జోక్యం చేసున్నారు. మణిపూర్ ఆంశం మీ నిద్ర కంటే చాలా ముఖ్యం అని సభ్యులనుద్దేశించి అన్నారు. 

ఈ బిల్లు రాజ్యాంగంపై దాడే: సోనియా

కాంగ్రెస్ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు ఎంపీ సోనియా గాంధీ వక్ఫ్ సవరణ బిల్లుపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ‘వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే. లోక్‌సభలో ప్రతిపక్షం నోరు నొక్కేసి ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నారు. రాజ్యాంగాన్ని అపహస్యం చేసేందుకే జమిలి ఎన్నికలు. బీజేపీ సభ్యులు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీలు మరింత దూకుడుగా వ్యవహరించాలి’. అని ఆమె పేర్కొన్నారు. 

యూటర్న్ తీసుకున్న నవీన్‌పట్నాయక్

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ యూ టర్న్ తీసుకున్నారు. బీజేడీకి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉండగా.. ఓటింగ్ విషయంలో వారి ఇష్టం అని నవీన్ ప్రకటించారు. 

లోక్‌సభలో ఓటింగ్ 

వక్ఫ్ బిల్లు ఆమోదం కోసం బుధవారం లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించారు. దాదాపు 14 గంటల పాటు ఈ బిల్లుపై చర్చ జరిగింది. అధికార పక్షం, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఎంపీలు ఓట్లేశారు. 56 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కింది. 

బీజేపీ ఎంపీల అభిప్రాయాలే పరిగణలోకి: నసీర్ హుస్సేన్

కాంగ్రెస్ ఎంపీ నసీర్ హుస్సేన్ మాట్లాడారు. ‘జేపీసీకి వచ్చిన వారిలో 98 శాతం మంది ఈ బిల్లును వ్యతిరేకించారు. సం బంధం లేని వారిని జేపీసీ సమావేశాలకు పిలిచారు. జేపీసీలో సరైన విధంగా చర్చ జరగలేదు. కేవలం బీజేపీ ఎంపీల సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. మీరు ఒక వర్గాన్ని రెండో శ్రేణిగా చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ఫైర్ అయ్యారు. 

ఇద్దరు జేడీయూ నేతల రాజీనామా

వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడాన్ని నిరసిస్తూ జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు మహ్మద్ ఖాసిం అన్సారీ, మహ్మద్ నవాజ్ మాలిక్‌లు పార్టీకి రాజీనా మా చేశారు. ‘ఈ రోజు జేడీయూ దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింల నమ్మకాన్ని వమ్ము చేసింది.’ అని వారు ఆరోపించారు. రాజీనా మా లేఖలను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు పంపారు.