28-03-2025 09:38:16 PM
మందమర్రి,(విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్స బోర్డు ఆస్తులు తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలో ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని రెండవ జోన్ లోని మదీనా మసీదులో జుమ్మా నమాజ్ అనంతరం జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ మహమ్మద్ ఇస్మాయిల్ సాహెబ్ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వము మదర్సాలను, మసీదులను, కబ్రస్థాన్, దర్గాలను, ఈద్గాలను, తన ఆధీనంలో తీసుకోవాలని పార్లమెంటులో బిల్లు ప్రతిపాదన చేసేందుకు సిద్ధం అవుతుందని దీనిని వ్యతిరేకించాలని కోరారు. ఈ బిల్లుకు ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని ఈ బిల్లును వెంటనే నిలిపి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి షరీఫ్, ఎండి యాకూబ్, ఎండి బషీర్ లు పాల్గొన్నారు.