25-04-2025 09:31:07 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడులను నిరసిస్తూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, జామియా మస్జిద్ ఉమర్ ఎ ఫరూక్ మహబూబాబాద్ మసీదు ప్రాంగణంలో జమ్మూ నమాజ్ చదివి అనంతరం ముస్లింలు నల్ల రిబ్బన్ ధరించి శాంతియుతంగా ముఫ్తీ ఆలంగిర్ సదర్ అజీజ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, దేశ భద్రతకు మద్దతుగా తమ ఐక్యతను ప్రకటించారు.
అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గమైన ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమాతే ఇస్లామీయ హింద్ అధ్యక్షుడు మొహమ్మద్ సత్తార్ మాట్లాడుతూ... మతం, కులం, ప్రాంతానికి అతీతంగా అందరూ కలసి దేశంలో ఉగ్రవాద మూలాలను నిరోధించడంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖలీల్ మాట్లాడుతూ ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చే దేశాలకు ప్రపంచ దేశాలు ఎలాంటి సహాయం అందించకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది ముస్లింలు పాల్గొని నిరసన తెలియజేశారు.